వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తం

అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశంలో పెరుగుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణం అవుతున్నాయి.

Updated : 11 Apr 2024 09:48 IST

ఇటు భూమిపైన, అటు సముద్రంపైన పెరిగిన వేడి
దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం
ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు రావచ్చు
‘ఈనాడు’తో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్‌ ఎం.రఘు
ఈనాడు - హైదరాబాద్‌

అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశంలో పెరుగుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణం అవుతున్నాయి. ఆహారం, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవాలి. మొక్కలను భారీగా పెంచి పచ్చదనాన్ని విస్తరించాలి.

ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ‘ఎల్‌ నినో’ ప్రభావంతో హిందూ మహా సముద్రంలో, భారతదేశంలోని నగరాలు, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్‌ రఘు ముర్తుగుద్దె పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని చెప్పారు. ఎల్‌ నినో సమయంలో వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ‘‘వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన, అటు సముద్రంపైన వేడి పెరిగింది. దాంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు నెలకొనవచ్చు. ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు రావచ్చు. వర్షానికి, వర్షానికి మధ్య విరామం పెరగవచ్చు... లేదా తగ్గవచ్చు. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉండొచ్చు’’ అని వివరించారు. రఘు అమెరికాలోని మేరిల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో వాతావరణ, సముద్రశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముంబయి ఐఐటీలోని వాతావరణ అధ్యయన విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

వాతావరణంలో విపరీతమైన వేడికి కారణాలు ఏంటి?

కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలలో కొన్నిసార్లు జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది. కానీ సాధారణ కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు మాత్రం వాతావరణం వేడిగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు, వెచ్చటి వాతావరణం ఉండే సముద్రాలు, కొన్నిసార్లు స్థానిక పరిస్థితులతో వాటిల్లే మార్పుల  ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలకు అవకాశాలు ఉంటాయి. దేశంలో పలుచోట్ల ఇప్పుడు అలాంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. 10 సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయి.

అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి?

గ్రీన్‌హౌస్‌ వాయువులు పెరగడం కూడా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నీటి ఆవిరి అధికం అవుతుంది. వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. గాలులు సైతం అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతాయి. మధ్య తూర్పు దేశాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. దాంతో అరేబియా సముద్రం వెచ్చగా ఉంటుంది. ఆ కారణాలతో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి పెరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేస్తుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమే. చెట్లను కాపాడుకోవాలి. పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలి.

ఎల్‌ నినో ప్రభావం ఎంతమేరకు ఉండొచ్చు?

దానివల్లే దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇది వేడిని పెంచుతుంది. ఎల్‌ నినోతో వడగాలులకూ అవకాశం ఉంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వంటి వాటిపై యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. విస్తృత ప్రచారమూ అవసరం. పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీలకు ముందే సమాచారం ఇవ్వాలి.

ప్రజా కోణంలో మీరిచ్చే సూచనలేమిటి?

సీజన్ల వారీగా వచ్చే వాతావరణ మార్పులు, వడగాలుల హెచ్చరికల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. వాటిని తెలుసుకొని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరికల సమయంలో వృద్ధులను, పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తీవ్ర ఎండల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడాలి. వడగాలుల ప్రభావానికి గురైతే ఆసుపత్రికి సకాలంలో చేర్చడం చాలా ముఖ్యం. అందుకు తగిన ఏర్పాట్లు అవసరం.

దేశంలో అధ్యయనాలు ఏమైనా ఉన్నాయా?

వాతావరణ మార్పుల ముప్పు అధికంగా రైతులు, నిర్మాణరంగ కూలీలు, చిరు వ్యాపారులు, మురికివాడల్లో నివసించేవారిపై ఎక్కువగా ఉంటుంది. ఎవరిపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే విషయమై కొన్ని అధ్యయనాలు జరిగాయి కానీ వాటికి భౌగోళిక విస్తృతి చాలా తక్కువ. వాటిల్లో ఎవరు బాధితులు అవుతారు అన్న సమాచారం లేదు. విస్తృత అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది.

దీనిపై ఓ క్రమబద్ధమైన సర్వే జరగాలని అభిప్రాయపడుతున్నారా?

జవాబు: అవును. వాతావరణ మార్పులతో కలిగే ప్రమాదం ఎలా ఉంటుందన్న విషయంపై నీటి నిర్వహణ, వ్యవసాయం, విద్యుత్తు, ఆరోగ్యం వంటి అంశాల్లో ప్రతి సీజన్‌లో ఓ క్రమబద్ధమైన సర్వే జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు, ఆస్తి, పంటలను కాపాడుకునేందుకు ఓ సమగ్ర ప్రణాళిక అవసరం. వాతావరణ సమాచార సేకరణ విషయంలో తెలుగు రాష్ట్రాల పనితీరు బాగానే ఉంది.

వ్యవసాయ ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంది?

అధికవర్షాలు లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటల నష్టం జరుగుతుంది. అయితే వానాకాలంలో కురిసే వర్షం నీటిని నిల్వ చేసుకోవాలి. తద్వారా వర్షాభావ పరిస్థితులు వచ్చినా ఇబ్బంది లేకుండా నీటిని వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని