ఉపాధి హామీ పనుల్లో వేతన వాటాల పెంపు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల భత్యాన్ని రూ.272 నుంచి రూ.300కి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పనుల వ్యయాలను కూడా సవరించాలని నిర్ణయించింది.

Published : 11 Apr 2024 03:53 IST

రోజుకు రూ.300 ప్రాతిపదికన సవరణ ప్రతిపాదనలు
జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు

ఈనాడు,హైదరాబాద్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల భత్యాన్ని రూ.272 నుంచి రూ.300కి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పనుల వ్యయాలను కూడా సవరించాలని నిర్ణయించింది. ఇందుకు గ్రామాల వారీగా చేపట్టిన పనుల సవరణ అంచనా వ్యయాలను పంపించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల వ్యయంలో కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను భరిస్తాయి. ఒక్కో పనిలో 40% సామగ్రి వాటా (మెటీరియల్‌), 60% వేతనవాటా (వేజ్‌ కాంపోనెంట్‌)గా పరిగణిస్తూ నిధుల అంచనా వ్యయ ప్రతిపాదనలు రూపొందిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో  ప్రతిపాదనలకు అనుగుణంగా 12,769 గ్రామ పంచాయతీలు చేపట్టిన 4,31,112 పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మరో 2,68,327 పనులకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం కూలిభత్యాన్ని రూ.278 నుంచి రూ.300కి పెంచింది. ఈ మేరకు చెల్లింపులు జరగాలంటే ప్రతి పనిలో వేతన వాటాను పెంచాల్సి ఉంటుంది. కూలీలకు రోజువారీ చెల్లింపులు జరపాల్సి ఉన్నందున అత్యవసరంగా అన్ని గ్రామ పంచాయతీలకు మంజూరైన పనులను కొత్త వేతన భత్యాలకు అనుగుణంగా సవరిస్తూ ఈ నెల 15 లోగా  ప్రతిపాదనలను పంపించాలని కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. కొనసాగుతున్న పనుల్లో మార్చి 31వరకు పూర్తయిన వాటిని మినహాయించి, మిగిలిన వాటిలో వేతన వాటా పెంచాలని... కొత్తగా ఆమోదం పొందిన 2,68,327 పనుల్లో మొత్తంగా వేతనవాటాను పెంచాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచడంవల్ల రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు రూ. 224కోట్ల మేరకు అదనపు చెల్లింపులు జరగనున్నాయి. సవరణ ప్రతిపాదనలను యుద్ధ ప్రాతిపదికన చేసేందుకు తమ పరిధిలోని మండల పరిషత్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులకు కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని