మేనరిక వివాహాలతో పిల్లల్లో నేత్ర వ్యాధుల ముప్పు

మేనరికం, ఇతర దగ్గర బంధువుల మధ్య వివాహాల కారణంగా వారికి పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులతోపాటు నేత్రాలకు సంబంధించిన సమస్యలు సంక్రమించే ముప్పు ఉందని ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి అధ్యయనంలో తేలింది.

Published : 11 Apr 2024 05:22 IST

ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మేనరికం, ఇతర దగ్గర బంధువుల మధ్య వివాహాల కారణంగా వారికి పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులతోపాటు నేత్రాలకు సంబంధించిన సమస్యలు సంక్రమించే ముప్పు ఉందని ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి అధ్యయనంలో తేలింది. ఈ మేరకు వంశపారంపర్య కంటి వ్యాధుల(హెరిడిటరీ ఐ డీసీజెస్‌-హెచ్‌ఈడీ)పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రక్త సంబంధీకులు, దగ్గర బంధువుల మధ్య జరిగే వివాహాలు, వంశపారంపర్యంగా నేత్ర సమస్యలు ఉన్న వారికి పుట్టే పిల్లలకు రెటీనా, కార్నియా, కంటి నరాలకు సంబంధించిన సమస్యలే కాకుండా బలహీనమైన దృష్టి, కంటిలో ఒత్తిడి పెరగడం, పగలు లేదా రాత్రి సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యలు వేధిస్తాయని అధ్యయనంలో తేలినట్లు పేర్కొంది. కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్‌ పిగ్మెంటోసా సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువని.. ఇవి కంటి చూపును పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ వైద్యులు డా.మంజుశ్రీ భాతే తెలిపారు. ‘‘కుటుంబ చరిత్రలో హెచ్‌ఈడీ ఉన్న జంటలకు జన్యు పరీక్షలు అవసరం. దానివల్ల పుట్టే పిల్లలు జన్యుపరమైన నేత్ర సమస్యల బారిన పడకుండా చూసుకోవడానికి వీలుంటుంది. ముందే గుర్తించడం వల్ల శస్త్ర చికిత్సలు, ఔషధాల ద్వారా నివారించవచ్చు’’ అని మంజుశ్రీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని