విచారణలు కొనసాగుతుండగా.. ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు న్యాయవిచారణ నిమిత్తం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ను నియమించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 11 Apr 2024 03:56 IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు న్యాయవిచారణ నిమిత్తం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ను నియమించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తదితరాలపై దాఖలైన అన్ని పిటిషన్‌ల విచారణను వేసవి సెలవుల తరువాత చేపడతామని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, నిర్మాణాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌, న్యాయవాది బి.రామ్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామరెడ్డి, న్యాయవాది ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ కె.ఎ.పాల్‌ వాదనలు వినిపిస్తూ కాగ్‌ నివేదిక ఆధారంగా పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, ప్రభుత్వ వాదన వినకుండా ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలా’ అని ప్రశ్నించింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్‌లో మార్చి 4న ఉత్తర్వులు జారీ చేశామని గుర్తుచేసింది. ‘నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ నిర్వహించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం అథారిటీకి విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం జస్టిస్‌ పి.సి.ఘోష్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌లపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దీనిపై ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేయబోతుండగా..అన్నింటికీ ఇదే ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని