ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందంతో ఆర్థిక భారం!

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోజుకు వెయ్యి మెగావాట్ల ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’ (పీపీఏ) దస్త్రాల్లో లోపాలెన్నో ఉన్నాయని తాజాగా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.

Published : 11 Apr 2024 03:56 IST

విద్యుత్కేంద్రం, బొగ్గు గనిపై అధ్యయనమే లేదు
జ్యుడిషియల్‌ కమిషన్‌కు సమాచారం అందించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోజుకు వెయ్యి మెగావాట్ల ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’ (పీపీఏ) దస్త్రాల్లో లోపాలెన్నో ఉన్నాయని తాజాగా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్‌ కమిషన్‌ను నియమించింది. పీపీఏకు సంబంధించిన దస్త్రాలను కమిషన్‌కు విద్యుత్‌ శాఖ అధికారులు తాజాగా పంపారు. ఈ సందర్భంగా పీపీఏ ఎలా చేసుకున్నారు.. లోపాలేమిటి.. అనే అంశాలను కమిషన్‌కు అధికారులు మౌఖికంగా వివరించారు. పీపీఏకు సంబంధించిన దస్త్రాల్లో ఉన్న అంశాలు, అధికారులు కమిషన్‌కు మౌఖికంగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అధ్యయనం జరగలేదు..

తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబరు 3న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో పీపీఏ చేసుకుంది. మార్వా థర్మల్‌ విద్యుత్కేంద్రం నుంచి కరెంటు సరఫరా చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హడావుడిగా తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసింది. ఒప్పందం చేసుకునే ముందు అసలు మార్వా ప్లాంటు నిర్మాణం పూర్తయిందా, కరెంటు ఎప్పటి నుంచి ఉత్పత్తి అవుతుందనే అధ్యయనమే చేయించలేదు. మార్వా ప్లాంటుకు బొగ్గును సరఫరా చేయడానికి అదే రాష్ట్రంలోని గరేపాం గనిని కేంద్ర బొగ్గు శాఖ కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ముందు రాష్ట్ర విద్యుత్‌రంగ నిపుణులు, అధికారులను మార్వాకు, గరేపాంకు పంపి అధ్యయనం చేయిస్తే పలు అంశాలు బయటపడేవి. ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందని అప్పటి విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు.

2016లో విద్యుత్‌.. 2020లో బొగ్గు ఉత్పత్తి

వెంటనే కరెంటు సరఫరా చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2014 నవంబరు 3న చెప్పగా మార్వా ప్లాంటులో ‘వాణిజ్య ప్రాతిపదికన విద్యుదుత్పత్తి (సీఓడీ)’ ప్రకటన 2016 జులైలో చేశారు. గరేపాం గనిలో బొగ్గు ఉత్పత్తి కూడా 2020లో మొదలైంది. బొగ్గు కొరత వల్ల 2016లో సీఓడీ ప్రకటించినా మార్వా ప్లాంటులో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరగక తెలంగాణకు పీపీఏ ప్రకారం సరఫరా చేయలేకపోయారు. ఈ ప్లాంటులో 2017-18లో 72%, 2018-19లో 64%, 2019-20లో 27%, 2020-21లో కేవలం 39%, 2021-22లో 19 శాతమే విద్యుదుత్పత్తి చేశారు. ఇంత తక్కువ ఉత్పత్తి కారణంగా తెలంగాణకు పీపీఏ ప్రకారం రోజుకు రావాల్సిన వెయ్యి మెగావాట్లలో ఐదారు వందల మెగావాట్లు కూడా రాలేదు. 2022 ఏప్రిల్‌ నుంచి పూర్తిగా సరఫరా నిలిచిపోయింది.

ఈ కరెంటు వస్తుందని.. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యుత్‌ లైన్ల కారిడార్‌లో ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని లైన్‌ కారిడార్‌ను అద్దెకు తీసుకుంటూ ‘జాతీయ పవర్‌ గ్రిడ్‌ సంస్థ (పీజీసీఎల్‌)’తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర డిస్కంలను ఆదేశించింది. చివరికి వెయ్యి మెగావాట్ల కరెంటు సరఫరా కాకపోయినా కారిడార్‌కు చేసుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిగా లైన్‌ రవాణా కిరాయిని అదనంగా రూ.638.50 కోట్లు డిస్కంలు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు మార్వా ప్లాంటుకు అదనంగా మరింత సొమ్మును స్థిరఛార్జీల కింద చెల్లించాల్సి ఉండగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఇవన్నీ కలిపితే ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా అనవసర ఆర్థికభారం పడినట్లు అంచనా. గని, ప్లాంటుపై ముందే అధ్యయనం చేయించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ‘భారం’ పడేది కాదని కమిషన్‌కు అధికారులు తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వంద రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఇటీవల వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని