మద్దతు ధర కోసం రైతుల ఆందోళన

ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా.. సరైన నాణ్యత ప్రమాణాలు లేవనే కారణంతో తక్కువ ధరలు నిర్ణయించడంపై రైతులు ఆందోళనకు దిగారు.

Published : 11 Apr 2024 03:57 IST

జనగామ వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
మార్కెట్‌ కార్యదర్శి సస్పెన్షన్‌
వ్యాపారులపై క్రిమినల్‌ కేసులకు అదనపు కలెక్టర్‌ ఆదేశాలు

జనగామ, కేసముద్రం, న్యూస్‌టుడే: ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా.. సరైన నాణ్యత ప్రమాణాలు లేవనే కారణంతో తక్కువ ధరలు నిర్ణయించడంపై రైతులు ఆందోళనకు దిగారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో బుధవారం చోటుచేసుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ మార్కెట్‌ వర్గాల కథనం ప్రకారం..రైతులు ఉదయాన్నే ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చారు. కొనుగోలు ధర నిర్ణయ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో అసహనానికి గురయ్యారు. చివరికి తక్కువ ధరలు నిర్ణయించడంతో అసంతృప్తి కాస్తా.. సాయంత్రానికి ఆగ్రహంగా మారింది. అన్నదాతలంతా ఆందోళనబాట పట్టడంతో సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ రైతులతో చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి అన్నదాతలను శాంతింపజేశారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా క్వింటాలుకు రూ.600 తక్కువ ధరతో కొనుగోళ్లకు సిద్ధపడిన వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. వ్యాపారుల దోపిడీని అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించారనే కారణంతో వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి భాస్కర్‌ను తక్షణం సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. మార్కెట్లోనే ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రం’ ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. అంతకుముందు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

కేసముద్రం మార్కెట్‌లోనూ..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు తగ్గడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏప్రిల్‌ 2న క్వింటాలుకు రూ.17 వేలు పలికిన ధర బుధవారం ఒక్కసారిగా రూ.14 వేలకు పడిపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. వ్యాపారులు కూడబలుక్కుని ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి వెంకట్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. మరోసారి పంట నాణ్యతను పరిశీలించి క్వింటాలుకు రూ.200 నుంచి రూ.1500 వరకు ధర పెంచడంతో రైతులు శాంతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని