గండం గట్టెక్కేదెలా!

రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్‌, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా..కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు.

Published : 12 Apr 2024 05:43 IST

జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు
తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం
ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు
గోదావరిలోకి రోడ్డు నిర్మాణం.. పంపులు సిద్ధం
సాగర్‌ నుంచి ఎత్తిపోతకు అదే తరహా కార్యాచరణ

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రామగుండం: రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్‌, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా..కృష్ణా పరీవాహకంలో ఆలమట్టి నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. పైపెచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండటం, ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండటంతో నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ తాగునీటికి పంపింగ్‌ చేసే ఇన్‌టేక్‌ వెల్స్‌కు మరికొద్ది రోజుల్లో నీరందడం కష్టంగా మారనుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇన్‌టేక్‌ వెల్స్‌ వరకు కాలువలను లోతుగా తవ్వగా..మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కసరత్తు ఆరంభించారు. ప్రధానంగా హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్య తలెత్తకుండా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ నుంచి నీటిని తోడేందుకు వీలుగా అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.

2016 నాటి అనుభవంతో..

రాష్ట్రంలో 2016లోనూ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరిలోకి ప్రత్యేక విద్యుత్‌ లైన్లు, రోడ్లు నిర్మించి నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద 140 మీటర్ల మట్టం వద్ద నీళ్లు ఉన్నాయి. 138 మీటర్లకు చేరితే అక్కణ్నుంచి నీటిని తీసుకోవడం సాధ్యం కాదు. హైదరాబాద్‌కు 330 క్యూసెక్కులు (రోజుకు 172 మిలియన్‌ గ్యాలెన్లు), పెద్దపల్లి జిల్లా పరిధిలో మిషన్‌ భగీరథకు 58 క్యూసెక్కులు, రామగుండం ఎరువుల కర్మాగారానికి 18 క్యూసెక్కులు అవసరం ఉంటోంది. అందుకు అనుగుణంగా పక్షం రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి మట్టం పడిపోతే నది మధ్యలోంచి ఎత్తిపోసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నదిలోకి కిలోమీటరున్నర దూరం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. 25 సబ్‌మెర్సిబుల్‌ పంపులను నదిలో ఏర్పాటుచేసి అప్రోచ్‌ కాలువలోకి ఎత్తిపోయనున్నారు. ‘‘జులై చివరి వారం నాటికి ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ప్రారంభమవుతుంది. అప్పటి లోపు నీటి ఎత్తిపోత తప్పనిసరిగా మారింది’’అని అధికారులు తెలిపారు.

  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల జలాశయం వద్ద 2016లో ప్రత్యేక మోటార్లు ఏర్పాటుచేసి రామన్‌పాడుకు తాగునీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది ఇన్‌ఫ్లో ఆలస్యమైతే ఎత్తిపోత తప్పదని అంచనా వేస్తున్నారు.
  • నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి హైదరాబాద్‌కు రోజుకు 270 మిలియన్‌ గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. సాగర్‌ నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోతే హైదరాబాద్‌కు నీటిని తీసుకునే పుట్టంగండి అప్రోచ్‌ కాలువకు నీళ్లు అందవు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాగర్‌లో ప్రత్యేకంగా పంపులు అమర్చి..అప్రోచ్‌ కాలువలోకి ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017లోనూ ఇదే తీరులో ఎత్తిపోశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని