25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు

జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది.

Published : 12 Apr 2024 05:43 IST

విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఎన్‌టీఏ
తదనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియలో మార్పు
ఈ నెల 21కి బదులు 27వ తేదీ నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాస్‌ మార్పు చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను ఏప్రిల్‌ 20న వెల్లడిస్తామని గతంలో ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌టీఏ సమాచారమిచ్చింది. దీంతో ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని ఐఐటీ మద్రాస్‌ గతేడాది డిసెంబరు 1న కాలపట్టిక విడుదల చేసింది. తాజాగా ఎన్‌టీఏ ఈ నెల 25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడిస్తామని ప్రకటించింది. ఫలితంగా ఐఐటీ మద్రాస్‌ ఈ నెల 21కి బదులు.. 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది. పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ చివరి విడత పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 9న ముగిశాయి. పేపర్‌-1కు ఈసారి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.40 లక్షల మంది పరీక్షలు రాసినట్లు అంచనా.

పరీక్ష మధ్యలో బయోమెట్రిక్‌ తీసుకోవడమా?

ఈసారి ఏపీలో పలు చోట్ల పరీక్ష ప్రారంభమైన తర్వాత బయోమెట్రిక్‌ హాజరు కోసం వేలిముద్రలు తీసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందే బయోమెట్రిక్‌ తీసుకోవాలి. ఆ సమయంలో కొందరి వేలిముద్రలు నమోదు కాకపోవడంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత సిబ్బంది వచ్చి పలుమార్లు ప్రయత్నించారు. ‘వేలిముద్రలు పడకుంటే పరీక్ష ముగిసిన తర్వాత తీసుకోవాలి. తీవ్రపోటీ ఉండే జాతీయస్థాయి పరీక్షలో ఒక్క నిమిషమూ విలువైందే. మా అబ్బాయి విజయవాడ కానూరులో ఈ నెల 9న పరీక్ష రాశాడు. తొలి విడతలో 99.74 పర్సంటైల్‌ వచ్చింది. ఈసారి ఇంకా మంచి పర్సంటైల్‌ సాధించాలని లక్ష్యంగా చదివాడు. సిబ్బంది అవగాహన రాహిత్యం కారణంగా దాదాపు 40 నిమిషాల సమయం వృథా అయ్యింది’ అని విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి ‘ఈనాడు’తో వాపోయారు. విజయనగరంలోనూ ఇదే సమస్య కారణంగా విద్యార్థులు నష్టపోయినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు