కులగణనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం

రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Published : 12 Apr 2024 03:42 IST

ఫులే విగ్రహానికి నివాళులు

ఖైరతాబాద్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఫులే జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఫులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రితోపాటు కమిటీ ఛైర్మన్‌ చిన్న శ్రీశైలంయాదవ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో కలిసి ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. కుల సంఘాల సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆయా సంఘాల ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుంటే కొన్ని నచ్చకపోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాల అధ్యక్షులకు ఫులే అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా.చిరంజీవులు, బీసీ సంఘాల కాంగ్రెస్‌ నేత నవీన్‌యాదవ్‌, బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారం గణేశ్‌చారి, కుల్కచర్ల శ్రీనివాస్‌, పల్లె    లక్ష్మణ్‌గౌడ్‌, వేముల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్‌ నాయకులు మన్నీలాల్‌ షా, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని