1930కు కృత్రిమ మేధ దన్ను!

రోజురోజుకు పెరిగిపోతున్న  సైబర్‌ నేరాల నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు నంబరు 1930కు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కృత్రిమ మేధను జోడించనున్నారు.

Published : 12 Apr 2024 03:55 IST

ఎంగేజ్‌’ సమస్య పరిష్కారానికి చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రోజురోజుకు పెరిగిపోతున్న  సైబర్‌ నేరాల నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు నంబరు 1930కు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కృత్రిమ మేధను జోడించనున్నారు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల వల్ల ఈ నంబరు ఎప్పుడూ ఎంగేజ్‌లోనే ఉంటుందని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పేలా కృత్రిమ మేధను ఉపయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. అడ్డగోలుగా పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో హోంమంత్రిత్వశాఖ ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బాధితులు ఫిర్యాదు చేసేందుకు దీని ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 1930 నంబరు పని చేస్తోంది. సైబర్‌ నేరాల బారిన పడ్డ ఎవరైనా ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుంటారు. బాధితుడు పోగొట్టుకున్న డబ్బు నిందితుడి ఖాతాలో పడకముందే ఆపేందుకు దీని ద్వారా అవకాశం ఏర్పడింది. ఈ నంబరుకు ఫిర్యాదు చేసిన వెంటనే సిబ్బంది బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకును అప్రమత్తం చేసి డబ్బు బదిలీ కాకుండా ఆపుతారు. ఆ తర్వాత విచారణ జరిపి, సైబర్‌నేరం జరిగిందని నిర్ధారణ అయ్యే పక్షంలో ఆ డబ్బు తిరిగి బాధితుడి ఖాతాలో పడేలా చేస్తారు. గత ఏడాది దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో రూ.123 కోట్లు ఇలా ఆపగలిగారు. అందుకే దీనికి వస్తున్న కాల్స్‌ కూడా వేలల్లోకి చేరాయి. గత ఏడాది రాష్ట్రంలో ఇలా ఏకంగా 85,030 ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నంబరు తరచూ ఎంగేజ్‌ వస్తోంది. అందుకే అధికారులు ఇప్పుడు కృత్రిమ మేధ ద్వారా ఫిర్యాదుదారుతో మాట్లాడే ‘బాట్‌’ను తయారు చేయాలని యోచిస్తున్నారు. ఫోన్‌ చేయగానే ఈ బాట్‌.. వివరాలు సేకరించి, తదనుగుణంగా కేసు నమోదు చేసి, లావాదేవీ నిలిపివేయాలంటూ బ్యాంకులకు సందేశం కూడా పంపుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని