ఆర్థిక నేరాల దర్యాప్తుపై ప్రత్యేక నజర్‌

రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నమోదైన కేసుల దర్యాప్తును త్వరగా ఒక కొలిక్కి తెచ్చి గట్టి శిక్షలు పడేట్టు చేస్తే మున్ముందు ఇలాంటి నేరాలు చేసేందుకు మోసగాళ్లు భయపడతారని భావిస్తోంది.

Published : 12 Apr 2024 03:55 IST

రూ.10 కోట్లు దాటిన కేసులపై నిశిత దృష్టి
వాటిని విడిగా విచారణ చేయించాలని యోచిస్తున్న పోలీసు శాఖ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నమోదైన కేసుల దర్యాప్తును త్వరగా ఒక కొలిక్కి తెచ్చి గట్టి శిక్షలు పడేట్టు చేస్తే మున్ముందు ఇలాంటి నేరాలు చేసేందుకు మోసగాళ్లు భయపడతారని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ఇలాంటి వాటిలో ముఖ్యమైన వాటిని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో అయితే సీసీఎస్‌లు, రాష్ట్రస్థాయిలో అయితే సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి. వీటిలో రూ.పదికోట్లు దాటిన కేసులను వేరుచేసి, విడిగా దర్యాప్తు చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీలాంచింగ్‌ ఆఫర్లని.. తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని.. ఫ్లాట్‌లు కట్టిస్తామని.. ఇలా కోకొల్లలుగా సాగుతున్న స్థిరాస్తి మోసాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే మొత్తం రూ.పదివేల కోట్ల విలువైన ఆర్థిక నేరాలు దర్యాప్తు దశలో ఉన్నాయి. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మరో రూ.15వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతుండటంతో వాటికి సంబంధించిన మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు మారుమూల పల్లెలకూ విస్తరించాయి. అలాగే అధిక వడ్డీ ఆశచూపి చేస్తున్నవీ విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇప్పటికీ తేలని గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో సగటున పదిశాతం ఆర్థిక నేరాలకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులలో దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతుంటుంది. ఉదాహరణకు వందల ఎకరాల భూములు ఆక్రమించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు ఇప్పటికీ తేలలేదు. 2016లో నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వందల  ఫిర్యాదులు రాగా దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి ఎకరాలు కబ్జా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుల దర్యాప్తు పూర్తిచేయాలంటే ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవాలి. బెదిరించి ఆయన తన పేరుమీద బదిలీ చేయించుకున్నట్లు నిరూపించే ఆధారాలు సేకరించాలి. అలానే ఇటీవల నమోదయిన సాహితీ సంస్థకు సంబంధించిన కేసులోనూ వందల మంది బాధితులు ఉన్నారు. ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నీ సేకరించి, వాటిలో దొర్లిన తప్పులను గుర్తించి, వాటన్నింటితో అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా నేరాల దర్యాప్తు ఆలస్యమవుతుంది. న్యాయవిచారణ కూడా నెమ్మదిగా సాగుతుంది. అయితే ఈ పరిస్థితికి చెక్‌ పెట్టి, ఆర్థిక నేరాల దర్యాప్తు త్వరగా ముగించి, ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నమోదయిన కేసులలో ముఖ్యమైన వాటి దర్యాప్తు సత్వరమే పూర్తి చేయించాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని