రూ.9.9 కోట్ల బియ్యం పురుగులపాలు

సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో కొందరు అధికారులు సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాంలు ఏర్పాటుచేస్తున్నారు.

Published : 12 Apr 2024 03:57 IST

అనుమతి లేకుండా గోదాం అద్దెకు తీసుకుని బియ్యం నిల్వ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో కొందరు అధికారులు సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాంలు ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో వేలాది టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. మిల్లర్ల నుంచి నాణ్యత లేని బియ్యం తీసుకుంటూ పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు. మెదక్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బొల్లారంలో 2021-22లో అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన గోదాంలో దాదాపు 2,900 టన్నుల బియ్యం పాడైపోవడం అందుకు నిదర్శనం. ఈ కారణంగా సంస్థకు సుమారు రూ.9.90 కోట్ల నష్టం వాటిల్లిందని, బాధ్యులైన డీఎం (జిల్లా మేనేజర్లు)లపై చర్యలు తీసుకోవాలని మెదక్‌ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు పౌరసరఫరాల శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎవరి లాభం కోసమో?

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్ల నుంచి వచ్చే బియ్యం అటు ఎఫ్‌సీఐతో పాటు కొంతమేర రాష్ట్ర కోటాకూ వస్తాయి. ఆ నిల్వలను పౌర సరఫరాల సంస్థ అధికారిక గోదాంలలో నిల్వ చేస్తారు. నిల్వలు అధికమైనప్పుడు సంస్థ ఉన్నతాధికారుల అనుమతితో ప్రైవేటు గోదాంలను అద్దెకు తీసుకుంటారు. 2022లో అప్పటి మెదక్‌ డీఎం సాయిరాం మెదక్‌ గ్రామీణ మండల పరిధి బొల్లారంలో ఓ గోదాంను అద్దెకు తీసుకుని, 7,900 టన్నుల బియ్యాన్ని నిల్వచేశారు. ఆ తర్వాత అందులో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని రేషన్‌ దుకాణాలకు పంపినట్లు సమాచారం. గోదాంను అద్దెకు తీసుకోవడం దగ్గర్నుంచి అందులో బియ్యం నిల్వచేసే విషయంలో డీఎం సాయిరాం ప్రధాన కార్యాలయం అనుమతి తీసుకోలేదని సమాచారం. దీంతో సుమారు 2,900 టన్నుల బియ్యం దీర్ఘకాలంగా గోదాంలోనే ఉండిపోయింది. ఆ బియ్యం మొత్తం పాడైంది. పురుగుల పాలైంది. బియ్యానికి పట్టిన పురుగులు కూడా చనిపోయి కుప్పలుగా పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మనుషులు తినేందుకు పనికిరావు..

సాయిరాం స్థానంలో ఆ తర్వాత డీఎంలుగా శ్రీనివాస్‌, కొద్దికాలం గోపాల్‌ పనిచేశారు. వారి తర్వాత 2023 సెప్టెంబరులో డీఎంగా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ అనుమతిలేని గోదాంను, అందులో బియ్యం నిల్వలను గుర్తించారు. నమూనాలను హైదరాబాద్‌ నాచారంలోని ఓ ప్రయోగశాలకు పంపించారు. ఈ వ్యవహారంలో జరిగిన లోపాలపై అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు 2023 నవంబరులో అప్పటి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు నివేదిక పంపించారు. ఆ బియ్యం తినడానికి పనికిరావంటూ నాచారంలోని ప్రయోగశాల ఇచ్చిన నివేదికనూ జతచేశారు. స్పందించిన కమిషనర్‌ ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అడిగారు. ఆ తర్వాత ఆ అధికారి బదిలీ కావడం, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఈ ప్రక్రియ, బాధ్యులైన అధికారులపై చర్యల అంశం నిలిచిపోయింది. ‘అనుమతి లేకుండా గోదాం ఏర్పాటుచేయడంతోపాటు అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేశారు. కార్పొరేషన్‌కు రూ.9.90 కోట్ల మేర నష్టం జరిగింది. అందుకు బాధ్యుడైన డీఎం సాయిరాంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కమిషనర్‌కు నివేదిక ఇచ్చాం. పాడైన బియ్యాన్ని అక్కణ్నుంచి తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అనుమతి కోరాం’ అని మెదక్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఈ తరహా గోదాంలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? అనే అనుమానాలు పౌరసరఫరాల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనుమతులతో ఉన్న గోదాంలలో బియ్యం నిల్వలు రికార్డుల మేరకు ఉన్నాయా? లేవా? అనే సందేహాలూ ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని