నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వర్షాలు.. ముగ్గురు మహిళల దుర్మరణం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వర్షాల కారణంగా.. శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో ముగ్గురు మహిళలు మృతి చెందారు. విద్యుదాఘాతంతో ఇద్దరు, పిడుగుపాటుకు మరొకరు మృత్యువాత పడ్డారు.

Published : 13 Apr 2024 06:01 IST

విద్యుదాఘాతంతో ఇద్దరు.. పిడుగుపాటుతో ఒకరు..

తాడూరు, ఉప్పునుంతల, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వర్షాల కారణంగా.. శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో ముగ్గురు మహిళలు మృతి చెందారు. విద్యుదాఘాతంతో ఇద్దరు, పిడుగుపాటుకు మరొకరు మృత్యువాత పడ్డారు. తాడూరు మండలం ఐతోల్‌లో దుకాణం రేకుల పైకప్పునకు ప్రమాదవశాత్తు విద్యుత్తు సరఫరా కావడంతో ఇద్దరు తోడికోడళ్లు విద్యుదాఘాతానికి గురై మరణించారు. గ్రామానికి చెందిన యూసుఫ్‌, తస్లీమ్‌బేగం (45) దంపతులు. సొంతింట్లో ఎలక్ట్రికల్‌, మోటారు మెకానిక్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం నుంచే ముసురు వర్షం కారణంగా దుకాణం పైకప్పు రేకులకు ఇంటి సర్వీస్‌ తీగ తాకి ఉండటంతో దుకాణంలోని సామగ్రికి విద్యుత్తు సరఫరా అయ్యింది. రాత్రి 7 గంటల సమయంలో తస్లీమ్‌బేగం సామగ్రి సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తోటికోడలు అలియాబేగం (40) కూడా విద్యుదాఘాతానికి గురైంది. స్థానికులు వారిని నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తస్లీమ్‌కు భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అలియాబేగంకు భర్త, నలుగురు కుమార్తెలు కాగా.. ఏడాది క్రితమే ఒక కుమార్తె పాము కాటుతో మృతి చెందింది. మరో ఘటనలో ఉప్పునుంతల మండలం తాడూర్‌ గ్రామానికి చెందిన గుండమోని శ్యామలమ్మ (34) మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో తన పొలంలో కట్టేసిన పశువులకు నీళ్లు తాగించేందుకు వెళ్లింది. పొలం పనుల తర్వాత సాయంత్రం 4 గంటలకు వర్షం ప్రారంభమవడంతో చెట్టు కిందకు వెళ్లి నిలబడింది. చెట్టుపై పిడుగు పడడంతో ఆమె మృతి చెందింది. పొలానికి వచ్చిన కుమారుడు విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆమెకు భర్త పర్వతాలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


7 జిల్లాల్లో వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 7 జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లాలోని అనేక మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కనగల్‌ మండలంలో 2.18 సెం.మీ. వర్షం కురిసింది. వేములపల్లి, త్రిపురారం, నల్గొండ, మిర్యాలగూడ, తిప్పర్తి, గుండ్లపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, సిద్దిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలో గరిష్ఠంగా 40.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని