పసిడి పరుగులు.. వెండి మెరుపులు

బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల్లోకి పెట్టుబడులు అధికంగా వస్తుండటమే ఈ పరిస్థితికి కారణం.

Updated : 13 Apr 2024 07:10 IST

10 గ్రాముల బంగారం రూ.75,000
రూ.85,500కు చేరిన కిలో వెండి

ఈనాడు వాణిజ్య విభాగం: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల్లోకి పెట్టుబడులు అధికంగా వస్తుండటమే ఈ పరిస్థితికి కారణం. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.74,910 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఒకదశలో రూ.76,200కు చేరింది. ఈ లెక్కన ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.68,600పైనే ఉంటుంది. కిలో వెండి కూడా రూ.85,500 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది కూడా రూ.87,100కు చేరింది. అంతర్జాతీయ కమొడిటీ ట్రేడింగ్‌లో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 2,429 డాలర్లకు వెళ్లినా, మళ్లీ 2,356 డాలర్లకు దిగివచ్చింది. అందుకనుగుణంగానే దేశీయ విపణిలోనూ ఈ లోహాల ధరలు కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగానూ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పసిడి ధర 16% పెరిగింది. రూపాయితో పోలిస్తే డాలర్‌ మారకపు విలువ వల్ల దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరీ అధికంగా ఉంది.

ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65,200 కాగా, 4 నెలలు కూడా గడవకముందే రూ.10,000 మేర పెరగడం కొనుగోలుదార్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం కొనుగోలు చేసేందుకు, ధరలు తగ్గుతాయని వేచి చూస్తున్న వారు అయితే నిశ్చేష్టులవుతున్నారు.

ధరల పెరుగుదలకు కారణాలు

భారత్‌ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోళ్లు జరపడం, అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాల వల్ల ఏర్పడిన అనిశ్చితి, రష్యా గనుల్లో పసిడి తవ్వకాల్లో ఏర్పడిన ఆటంకాలు.. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. 2023లో చైనా కేంద్ర బ్యాంక్‌ ఒక్కటే 225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి, తన నిల్వల మొత్తాన్ని 2200 టన్నుల కంటే అధికంగా పెంచుకుందని సమాచారం. ఈ కొనుగోళ్లను చైనా ఇంకా ఆపలేదనీ సమాచారం. పోలండ్‌ కేంద్రబ్యాంకు 130 టన్నులు, సింగపూర్‌ 77 టన్నుల బంగారాన్ని పోగేసుకుంది. తుర్కియే, జోర్డాన్‌, చెక్‌ రిపబ్లిక్‌ కేంద్ర బ్యాంకులు కూడా గణనీయంగా పసిడి నిల్వలు పెంచుకున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలపడుతున్న రష్యాకు చెందిన దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు ద్రవ్యాన్ని పాశ్చాత్య దేశాలు స్తంభింప చేశాయి. చైనా కూడా అమెరికాతో తనకు ఉన్న వివాదాల నేపథ్యంలో, తన విదేశీ మారకపు ద్రవ్యాన్ని స్తంభింప చేయొచ్చనే ఆందోళనతోనే ఇంతగా బంగారాన్ని కొంటోందని భావిస్తున్నారు. చైనా వద్ద 3 లక్షల కోట్ల అమెరికా డాలర్ల విదేశ మారకపు ద్రవ్యం ఉంది. ప్రతి దేశం కూడా తన విదేశీ మారకపు ద్రవ్యాన్ని వేర్వేరు ప్రధాన కరెన్సీలు, పసిడి నిల్వల రూపంలో అట్టేపెట్టుకుంటాయి. కరెన్సీల పైకంటే, సురక్షితమైన బంగారంపై ఆధారపడటం మేలనే భావనకు కేంద్ర బ్యాంకులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమనే విశ్లేషణలు వస్తున్నాయి.

మన రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఇటీవలి నెలల్లో 13 టన్నుల మేర కొనుగోలు చేయడంతో, ఈ ఏడాది జనవరికే మొత్తం నిల్వలు 800 టన్నులకు మించాయి. మనదేశ బంగారు నిల్వల విలువ 50 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుంది. మన మొత్తం విదేశీ మారకపు నిల్వలు ఈ నెల మొదటివారం చివరకు 648 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని