ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు!

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Updated : 13 Apr 2024 07:37 IST

ఎస్సైని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత
రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో విస్మయకర అంశాలు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్‌ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో భారాసకు మద్దతుగా.. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో భారాస ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్‌గా వినియోగించుకున్న ఓ ఎస్సైకి రాధాకిషన్‌రావు తప్పుడు సమాచారమిచ్చి బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ.. నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని, సహకరించాలని ఎస్సైని రాధాకిషన్‌రావు నమ్మించినట్లు వెల్లడైంది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్‌డేల్‌ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్‌ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్‌ చేస్తూ.. ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు.

విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత

  • రాధాకిషన్‌రావు సూచనతో ఎస్సై ఓ సందర్భంలో సికింద్రాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును కలిశారు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్సై రాణీగంజ్‌కు వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్‌రావుకు ఆ డబ్బును అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్‌రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్‌గంజ్‌ వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని మలక్‌పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్‌రావుకు అప్పగించారు.
  • మరోసారి శివచరణ్‌రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్సై వెళ్లి అక్కడి నుంచి రూ.కోటి తీసుకొచ్చి తెల్లాపూర్‌లో అప్పగించారు. అక్టోబరు మూడో వారంలో రెండు, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్‌కు అప్పగించారు.

అనుమానం వచ్చినా ప్రశ్నించలేక..

తరచూ డబ్బు తరలింపుపై ఎస్సైకి అనుమానం వచ్చినా, ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్‌రావును ప్రశ్నించలేకపోయారు. రాధాకిషన్‌రావును ఎన్నికల కమిషన్‌ తొలగించిన తర్వాత.. ఆయన భారాసకు అనుకూలంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎస్సైకి అర్థమైంది. భారాస ఓటమి పాలైన అనంతరం డిసెంబరు 4న రాధాకిషన్‌రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన రెండు సెల్‌ఫోన్లను ఫార్మాట్‌ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకొంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే (రిట్రీవ్‌) దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డ్డి తన బాల్యస్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్సైని ఎస్కార్ట్‌గా పంపించినట్లు రాధాకిషన్‌రావు పోలీసు విచారణలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని