విజిలెన్స్‌ డీజీ బాధ్యతలు ఎవరికో?

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు మొదలు అనేక పథకాలపై విజిలెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Published : 13 Apr 2024 03:48 IST

రాజీవ్‌ రతన్‌ మరణంతో ఏర్పడిన ఖాళీ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు మొదలు అనేక పథకాలపై విజిలెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ పనిచేసిన రాజీవ్‌రతన్‌ హఠాన్మరణంతో ఈ పోస్టు ఖాళీ అయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలపై విజిలెన్స్‌ విచారణ జరుపుతుండగా.. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో పాటు మిషన్‌ భగీరథ, సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్‌, నారాయణపేట వైద్య కళాశాల నిర్మాణంలో అవకతవకలు, కంకర మిల్లుల నిబంధనల ఉల్లంఘన వంటి కేసులు ఉన్నాయి. వీటి విచారణ నిమిత్తం నిజాయతీపరుడిగా పేరున్న రాజీవ్‌రతన్‌ను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్‌ డీజీగా నియమించింది. అనతికాలంలోనే ఈ కేసులపై ఆయన పట్టు సాధించారు. దర్యాప్తుతో పాటు నివేదికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో అకస్మాత్తుగా మరణించడంతో విచారణకు అంతరాయం కలిగింది. ఆయా అంశాలపై ఇకపైనా కట్టుదిట్టంగా విచారణ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సమర్థుడైన అధికారిని నియమించాలని యోచిస్తోంది. దీంతో విజిలెన్స్‌ డీజీగా ఎవర్ని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని