రిట్‌ పిటిషన్‌లో ‘యాజమాన్య హక్కును తేల్చే పరిధి’ హైకోర్టుకు లేదు

విద్యుత్తు కనెక్షన్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణలో ఆ భూముల యాజమాన్య హక్కును తేల్చే పరిధి హైకోర్టుకు లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Published : 13 Apr 2024 03:48 IST

సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసిన ధర్మాసనం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు కనెక్షన్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణలో ఆ భూముల యాజమాన్య హక్కును తేల్చే పరిధి హైకోర్టుకు లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సోహన్‌లాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, థాన్‌సింగ్‌ నాథ్మాల్‌ వర్సెస్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ట్యాక్సెస్‌, దూబ్రి కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌ లేఅవుట్‌లో తమ ప్లాట్‌లకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ విద్యుత్తు కనెక్షన్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ గోపు నాగమణి, మరో అయిదుగురు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్లకు విద్యుత్తు కనెక్షన్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతోపాటు, ప్రతివాదిగా అనుమతించాలంటూ ఈ లేఅవుట్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన జైహింద్‌ గ్రీన్‌ఫీల్డ్స్‌ ఎల్‌ఎల్‌పీ చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. జైహింద్‌ గ్రీన్‌ఫీల్డ్స్‌కు ఆ భూములపై హక్కులు లేవని తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జైహింద్‌ గ్రీన్‌ఫీల్డ్స్‌ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. విద్యుత్తు కనెక్షన్‌కు సంబంధించిన వివాదంపై దాఖలైన పిటిషన్‌లో.. కనెక్షన్‌ల మంజూరులో ఉన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంలో సింగిల్‌ జడ్జి విఫలమయ్యారని పేర్కొంది. భూములపై హక్కులను రిట్‌ పిటిషన్‌లలో నిర్ధారించే పరిధి ఈ కోర్టుకు లేదని తెలిపింది. ఈ భూములపై హక్కులకు సంబంధించిన వివాదాలు సివిల్‌ కోర్టుల్లో ఉన్నాయని, అందువల్ల సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విద్యుత్తు కనెక్షన్‌ను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ను ఆదేశించింది. ఆ ప్రక్రియకు ముందు జైహింద్‌ గ్రీన్‌ఫీల్డ్స్‌ వాదనలను వినాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని