11 పురపాలికలకు రూ.2,524 కోట్లు

రాష్ట్రంలోని 11 పురపాలక సంఘాల్లో తాగునీటి, భూగర్భ మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Published : 13 Apr 2024 03:49 IST

తాగునీరు, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
తక్కువ వడ్డీకి రుణం ఇవ్వనున్న నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 11 పురపాలక సంఘాల్లో తాగునీటి, భూగర్భ మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆయా వ్యవస్థల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు రుణంగా ఇవ్వనుంది. 50 వేల నుంచి పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆయా వ్యవస్థల ఏర్పాటుకు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పథకం కింద రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణలోని 11 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,524 కోట్లు ఇవ్వనుంది. ఏడు మున్సిపాలిటీల్లో తాగునీటి వ్యవస్థ, నాలుగుచోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా సుమారు రూ.900 కోట్ల విడుదలకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అమృత్‌ పథకంలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేందుకు ప్రయోగాత్మకంగా 12 మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వాటికి అదనంగా పూర్తిస్థాయిలో వ్యవస్థ ఏర్పాటుకు తాజాగా ఈ మున్సిపాలిటీలు అర్హత పొందాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

తక్కువ వడ్డీకి...

తాగునీటి, భూగర్భ మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకయ్యే వ్యయంలో 85 శాతాన్ని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు రుణంగా ఇవ్వనుంది. బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కన్నా 1.5 శాతం తక్కువ వసూలు చేయనుంది. మిగిలిన 15 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. తీసుకున్న రుణాన్ని అయిదు సమాన వాయిదాల్లో ఏడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడేళ్లలో రెండేళ్లపాటు రుణ చెల్లింపులపై తాత్కాలిక నిషేధం(మారిటోరియం) కూడా ఉందని బ్యాంకు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని