జంట నగరాల నీటి సరఫరాకు కసరత్తు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు కనీస మట్టానికి పడిపోవడంతో హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు నీరు అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 13 Apr 2024 04:37 IST

పుట్టంగండిలో ఎత్తిపోతలకు అత్యవసర మోటార్ల ఏర్పాటు

ఈనాడు, నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు కనీస మట్టానికి పడిపోవడంతో హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు నీరు అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పుట్టంగండిలో అత్యవసర మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు అధికారులతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు జీరో పాయింట్‌ వద్ద ఐదు 600 హెచ్‌పీ, ఐదు 300 హెచ్‌పీ సామర్థ్యమున్న పది మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిత్యం ఇక్కడి నుంచి హైదరాబాద్‌ జంట నగరాలకు 270 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మోటార్లకు కావాల్సిన విద్యుత్తు లైన్‌, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు జరుగుతోంది. సాగర్‌ నీటి మట్టం 510 అడుగుల వరకు ఉంటే పుట్టంగండి అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసి సిస్టర్న్‌ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ జలాశయం (ఏకేబీఆర్‌), అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా కోదండాపురం ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు చేరుస్తారు. శుక్రవారం సాయంత్రానికి సాగర్‌ నీటి మట్టం 510.30 అడుగులు (132.18 టీఎంసీలు)గా ఉంది. మరో 0.30 అడుగులు దిగువకు చేరితే నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీకి పడిపోతుంది. మూడు నాలుగు రోజుల్లోపే నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2016 తర్వాత సాగర్‌ ప్రాజెక్టు నుంచి అత్యవసర మోటార్ల ద్వారా నీటిని తరలించడం ఇదే ప్రథమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని