మాటల మంత్రం.. ఓట్ల తంత్రం!

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితోపాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి.

Updated : 14 Apr 2024 06:49 IST

క్రమంగా వేడెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం
మహిళలు, యువతకు గాలం.. ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు
ఈనాడు - హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితోపాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన చోట ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలోని హైదరాబాద్‌ సీటు మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్య ఈసారి కీలక పోరు సాగనుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌, భాజపాలు హోరాహోరీ తలపడనుండగా.. కొన్నిచోట్ల కాంగ్రెస్‌, భారాసల మధ్య పోరు నెలకొంది. ప్రచారంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అన్ని పార్టీలు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను అంచనా వేసుకుంటూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతపై గురి పెట్టాయి.

గ్యారంటీలపై కాంగ్రెస్‌ నమ్మకం

శాసనసభ ఎన్నికల్లో కలిసి వచ్చిన గ్యారంటీ కార్డును కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉపయోగించుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలును చాటి చెబుతూ ఇటీవల తుక్కుగూడ సభావేదికగా రాహుల్‌గాంధీ ఆవిష్కరించిన పాంచ్‌ న్యాయ్‌ గ్యారంటీలను కూడా ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాయితీ గ్యాస్‌బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర గ్యారంటీల అమలును అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెడుతూనే పథకాల అమల్లో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. భారాస ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగుబాటు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం, ధరణి భూ సమస్యలతోపాటు రాష్ట్రంలో కరవుకు కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో ఆరోపిస్తున్నారు. విభజన హామీలను కేంద్రంలోని భాజపా అమలు చేయకపోవడంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రాలేదని, నిధులు పెద్దఎత్తున నిలిచిపోయాయంటూ ఆ పార్టీపైనా విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ తరహాలో ఒక భారీ పరిశ్రమ, ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ సభలకు కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులను చేర్చుకుంటూ ఎన్నికల ముందు ఆ పార్టీలను బలహీనపర్చే వ్యూహాలను అమలు చేస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాలపై భారాస దృష్టి

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలే తమ అస్త్రశస్త్రాలుగా మలుచుకుని భారాస ఎన్నికల సమరంలోకి దిగుతోంది. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ముందుగా రాష్ట్రంలో కరవు పరిస్థితులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ కుంగితే మరమ్మతు చేయాలి గానీ పంటలను ఎండబెడతారా అని.. ప్రశ్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతను తమ ప్రభుత్వం ప్రారంభిస్తే కాంగ్రెస్‌ అసలు పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టుల నిర్మాణాల ఊసుకూడా లేదని ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తూనే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. రైతుల గోస ఈ ప్రభుత్వానికి పట్టదంటూ భారాస అధినేత కేసీఆర్‌ పంటల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు వర్గాలను ఆకర్షిస్తున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని, సాధ్యం కాని హామీలిచ్చారని, రైతుబంధు లాంటి పథకాలను కాంగ్రెస్‌ పక్కన పెట్టిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపాలు ఒక్కటేనన్న ఆరోపణలతో భారాస ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ప్రత్యర్థుల లోపాలే భాజపా అస్త్రాలు

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని కీలకమైన ప్రచారాస్త్రంగా భాజపా వినియోగిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం, ప్రత్యర్థి పార్టీల నుంచి కీలక నేతల చేరికలు.. పెద్ద ఎత్తున లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునేందుకు దోహదం చేస్తాయని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు అగ్ర నాయకత్వాన్ని ప్రచారానికి తీసుకురావడం, రోడ్‌షోలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పసుపుబోర్డు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం, ఎస్సీ వర్గీకరణకు భరోసా వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అర్బన్‌ ఓటర్లపై కీలకంగా దృష్టి సారించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నాయకులు భారాస అవినీతిపై విమర్శలు చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చర్యలు లేవని.. ఆ రెండు ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు. అయోధ్య రామమందిరం అక్షితల పంపిణీతో భక్తుల మనసు గెలవడం లాంటి అంశాలు కూడా ఓటర్లు భాజపావైపు ఆకర్షితులయ్యేందుకు దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని