అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ

పంట కోతల సమయంలో అకాలవర్షాలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. శనివారం నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ఆయా పంటలు దెబ్బతిన్నాయి.

Published : 14 Apr 2024 03:03 IST

నిజామాబాద్‌ జిల్లాలో 40.3 మి.మీ. వర్షపాతం
పలు జిల్లాల్లో వరి సహా ఇతర పంటలకు నష్టం
రైతుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌, కామారెడ్డి: పంట కోతల సమయంలో అకాలవర్షాలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. శనివారం నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ఆయా పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం చిన్నమావందిలో 40.3 మి.మీ., సంగారెడ్డి జిల్లా కంగ్టిలº 30.5, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 26.5, బిచ్కుందలో 25, నస్రుల్లాబాద్‌లో 24, మద్నూర్‌ మండలం మేనూర్‌లో 20, జుక్కల్‌లో 10.6, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, రెంజల్‌లో 10 మి.మీ. వర్షపాతం నమోదైంది. మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో వరి కోతలు చివరి దశలో ఉండగా.. 22 జిల్లాల్లో పంట కోతకొచ్చింది. ఈ తరుణంలో అకాల వర్షాలతో పొలాల్లోని వరి తడిసి గింజలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేల వాలింది. వేరుసెనగ, పెసలు, మినుము చేలల్లో నీరు నిలిచాయి. ఈదురుగాలుల ప్రభావంతో మామిడికాయలు, పిందెలు రాలిపోయాయి. వర్షాలు కొనసాగితే పంటలు మరింత దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మార్కెట్‌యార్డుల్లో షెడ్లు లేకపోవడంతోపాటు పంట కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చే నాలుగు రోజులు మళ్లీ ఎండలు

రాష్ట్రంలో ఆదివారం నుంచి బుధవారం వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ శనివారం తెలిపింది. 14 నుంచి 17 వరకు మళ్లీ ఎండలు పెరగనున్నాయని... 18, 19న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలలో 41.1 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 8 జిల్లాల్లో 40 డిగ్రీలపైన నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని