పోలీసులే సాక్షులు.. వాంగ్మూలాలే ఆధారాలు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు దుగ్యాల ప్రణీత్‌రావు కీలకమైన హార్డ్‌డిస్క్‌లను ముక్కలుగా ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది.

Updated : 14 Apr 2024 06:52 IST

ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లలో పనిచేసిన సిబ్బంది విచారణ
హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణ
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పకడ్బందీగా దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌ : ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు దుగ్యాల ప్రణీత్‌రావు కీలకమైన హార్డ్‌డిస్క్‌లను ముక్కలుగా ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)తో పాటు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం నడిచిన సమయంలో ఎస్‌ఐబీలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బందితోపాటు క్షేత్రస్థాయి ఆపరేషన్లు, నగదు అక్రమరవాణా గుట్టుమట్లు తెలిసిన పోలీసుల వాంగ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుల నేతృత్వంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగాయో ఈ వాంగ్మూలాల ద్వారా తేటతెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయస్థానంలో సమర్పిస్తున్నారు.

8 ఉదంతాల్లో రూ.10.41 కోట్ల స్వాధీనం

ప్రభాకర్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావు బృందం భారాస ప్రత్యర్థి నేతలకు చెందిన నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టడం, దాన్ని రాధాకిషన్‌రావుకు చేరవేయడం, వెంటనే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవడం.. ఇదీ ఫోన్‌ట్యాపింగ్‌ దందా సాగినతీరు. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆర్థిక వనరులు అందకుండా అడ్డుకోవడం ద్వారా భారాస అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతోనే ఇలా అడ్డదారిలో నిఘా అమలుపరిచినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైంది. 2018 ఎన్నికల సమయంలో రాంగోపాల్‌పేట ఠాణా పరిధిలో రూ.70 లక్షలు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బేగంపేటలో రూ.కోటి, మునుగోడు ఉపఎన్నిక సమయంలో గాంధీనగర్‌లో రూ.3.5 కోట్లు, అసెంబ్లీ ఎన్నికల వేళ గత ఏడాది అక్టోబరులో బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్లు, గాంధీనగర్‌ ఠాణా పరిధిలో రూ.22 లక్షలు, నగరంలోని మరోచోట రూ.15 లక్షలు, నారాయణగూడ ఠాణా పరిధిలో మరో రూ.49 లక్షలు, భవానీనగర్‌లో రూ.కోటి.. ఇలా ఎనిమిది ఉదంతాల్లో రూ.10.41 కోట్ల మేర ప్రత్యర్థి పార్టీలకు చెందిన నగదు రవాణాను అడ్డుకోగలినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


హవా నడిచినప్పుడు ఆడిందే ఆట

స్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా రాధాకిషన్‌రావుల హవా నడిచినప్పుడు వారు ఆడిందే ఆటగా సాగింది. అక్రమమని తెలిసినా.. రాజకీయనేతల ఫోన్ల ట్యాపింగ్‌ యథేచ్ఛగా సాగిపోయింది. ఆ ఇద్దరు బాస్‌ల ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తు.చ.తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాలను బట్టి తెలుస్తోంది.

  • గతంలో ఎస్‌ఐబీలో పనిచేసి ప్రసుత్తం సీఐడీలో ఉన్న ఓ ఇన్‌స్పెక్టర్‌ వాంగ్మూలం సేకరించారు. ఆయన ఎస్‌ఐబీలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావుల సూచనల మేరకు అనధికారిక నిఘా ఎలా కొనసాగిందో దర్యాప్తు బృందానికి కూలంకషంగా వివరించారు. రాధాకిషన్‌రావు నేతృత్వంలో ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును అడ్డుకుని, ఎలా జప్తు చేశారనేది వెల్లడించారు.
  • గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ఇప్పుడూ అక్కడే ఉన్న మరో ఇన్‌స్పెక్టర్‌ వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఎనిమిది సార్లు ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును ఎలా పట్టుకోగలిగామనే విషయాన్ని వెల్లడించారు.
  • రాధాకిషన్‌రావు తనను ఎలా ఏమార్చారనే అంశాన్ని టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఒకరు పూసగుచ్చినట్లు వివరించారు. భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన నగదును ఎలా తరలించారు.. ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీకి డబ్బులు ఎలా చేర్చారు.. అనేది వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని