అంత దిగుబడి ఎలా సాధ్యం?

సీతారామ ఎత్తిపోతల పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో ప్రధానమైన సాగు ద్వారా వచ్చే పంటల దిగుబడిని చాలా ఎక్కువగా చూపారని, అంత దిగుబడి ఎలా సాధ్యమో వివరంగా నివేదించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) కోరింది.

Updated : 14 Apr 2024 05:18 IST

వ్యవసాయ గణాంకాలకు.. డీపీఆర్‌లో వివరాలకు పొంతనే లేదు
సీతారామ ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారుకు సీడబ్ల్యూసీ లేఖ
తాగునీటి ప్రయోజనాలపైనా వివరాలు పంపాలని సూచన

ఈనాడు హైదరాబాద్‌: సీతారామ ఎత్తిపోతల పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో ప్రధానమైన సాగు ద్వారా వచ్చే పంటల దిగుబడిని చాలా ఎక్కువగా చూపారని, అంత దిగుబడి ఎలా సాధ్యమో వివరంగా నివేదించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) కోరింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లో పేర్కొన్న వివరాలకు, వ్యవసాయ గణాంకాల నివేదికలో తెలిపిన దిగుబడికి చాలా వ్యత్యాసం ఉందని గుర్తుచేసింది. మొదట సీతారామ ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించింది. తర్వాత సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయ ప్రయోజనాల నిష్పత్తిని (కాస్ట్‌-బెనిఫిట్‌ రేషియో) బేరీజు వేసే ఉద్దేశంతో రెండు పథకాలను కలిపి ఒకే పథకంగా డీపీఆర్‌ సమర్పించాలని కేంద్ర జల సంఘం కోరింది. జల సంఘం సూచన మేరకు రెండు పథకాలకు కలిపి నీటిపారుదల శాఖ డీపీఆర్‌ రూపొందించింది. 2023 జూన్‌ ధరల ఆధారంగా సుమారు రూ.19,954 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ అందులో పేర్కొంది. దాన్ని పరిశీలించిన కేంద్ర జల సంఘంలోని ప్రాజెక్టు వ్యయ పరిశీలన విభాగం ఖర్చును రూ.19,026 కోట్లుగా ఖరారు చేసినట్లు ఈ ఏడాది జనవరిలో నీటిపారుదల శాఖకు సమాచారమిచ్చింది. నీటి కాంపొనెంట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ వ్యయాన్ని ఖరారు చేసినట్లు తెలిపింది.

మరిన్ని సందేహాలతో తాజాగా మరో లేఖ

ప్రాజెక్టు వ్యయ ప్రయోజన నిష్పత్తి 1:1.58(రూపాయి ఖర్చుపెడితే రూపాయి యాభై ఎనిమిది పైసలు ఆదాయం)గా డీపీఆర్‌లో నివేదించారని, ఇందులో తమ పరిశీలనకు వచ్చిన అంశాలను మీ దృష్టికి తెస్తున్నామని, వీటికి సమాధానం ఇవ్వాలని కోరుతూ ఇటీవల కేంద్ర జల సంఘం నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ‘ప్రాజెక్టు వ్యయ ప్రయోజనాన్ని లెక్కించేటప్పుడు హెక్టారుకు 79.07 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని, పత్తి 49.42 క్వింటాళ్లు, మొక్కజొన్న 69.19 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. అయితే 2022 వ్యవసాయశాఖ గణాంకాల నివేదిక ప్రకారం తెలంగాణలో సరాసరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 33 క్వింటాళ్లు, పత్తి 5.46 క్వింటాళ్లు, మొక్కజొన్న 51.78 క్వింటాళ్లుగా ఉంది. మీరు డీపీఆర్‌లో పేర్కొన్న వివరాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అంత దిగుబడి ఎలా సాధ్యమైందో వ్యవసాయ శాఖ చెప్పాలి. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల కింద దిగుబడి ఎంత ఉందో సరిపోల్చి సమాచారం పంపాలి. తాగునీటి వల్ల ఏడాదికి రూ.54 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలు పంపాలి’ అని లేఖలో కోరింది. ఈ పథకానికి జలసంఘం అనుమతులు సాధించడంలో వ్యయ ప్రయోజన నిష్పత్తి నివేదిక కీలకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని