తుది తీర్పునకు లోబడే రెడ్‌ ఫోర్ట్‌ అక్బర్‌ నిర్మాణాలు: హైకోర్టు

రంగారెడ్డి జిల్లా షేక్‌పేటలోని 4.18 ఎకరాల్లో రెడ్‌ ఫోర్ట్‌ అక్బర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌ఏపీపీఎల్‌) చేపట్టిన నిర్మాణాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 14 Apr 2024 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా షేక్‌పేటలోని 4.18 ఎకరాల్లో రెడ్‌ ఫోర్ట్‌ అక్బర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌ఏపీపీఎల్‌) చేపట్టిన నిర్మాణాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. వేలం వేయకుండా 2021లో 4.18 ఎకరాలను ఆర్‌ఎఫ్‌ఏపీపీఎల్‌కు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి భూమిని వాపసు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రాష్ట్రీయ వానరసేన అనే ధార్మిక సంస్థ గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రస్తుతం అందులో రెడ్‌ ఫోర్ట్‌ చురుగ్గా నిర్మాణాలు చేపడుతోందని, పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.

ఉమ్మడి రాష్ట్రంలో బాచుపల్లిలో గృహ నిర్మాణ సముదాయం కోసం ఏపీ గృహ నిర్మాణ మండలి అనుబంధ కంపెనీ డెక్కన్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ (దిల్‌)కు అప్పగించిన భూమిలో ఇందూ ప్రాజెక్ట్సు నిర్మాణ పనులను దక్కించుకుంది. ఆ పనుల నిమిత్తం దిల్‌ అనుమతితో ఇందూ ప్రాజెక్ట్స్‌ ఎస్పీవీగా రెడ్‌ ఫోర్ట్‌ను ఏర్పాటు చేసింది. రూ.477 కోట్లకు 90 ఎకరాలు అప్పగించగారూ.285.57 కోట్లు చెల్లించింది. వివాదాలతో ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో సొమ్ము వాపసు చేయాలని రెడ్‌ ఫోర్ట్‌ కోరగా షేక్‌పేటలో సర్వే నం.403లో రూ.116.10 కోట్ల విలువైన 10 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అనంతరం 2021లో ఇదే సర్వే నంబరులో మరో 4.18 ఎకరాలను కేటాయించింది. వేలం వేయకుండా ఏకపక్షంగా భూమిని అప్పగించారంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుర్రం రఘు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

అంతేగాకుండా 2013నాటి విలువతో 2021లో అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. రెడ్‌ ఫోర్ట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో ఆర్బిట్రేషన్‌ అవార్డు కింద ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందన్నారు. అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ దశలో నిర్మాణాల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, అయితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామంటూ వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని