అన్నదాతలూ.. ఆందోళన వద్దు

రైతులెవరూ కంగారుపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని.. జూన్‌ నెలాఖరు వరకూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.

Published : 14 Apr 2024 03:34 IST

జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొంటాం
నిబంధనల మేరకు తెస్తే మద్దతు ధర లభించేలా చూస్తాం
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రైతులెవరూ కంగారుపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని.. జూన్‌ నెలాఖరు వరకూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని తెలిపారు. నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకొస్తే మద్దతు ధర కంటే నయాపైసా తక్కువ రాకుండా చూసే బాధ్యత తమదని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర కంటే ఎవరూ తక్కువకు కొనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. యాసంగిలో 75.40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈసారి సాగు తగ్గడంతో 60 లక్షల టన్నులకు పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని సివిల్‌ సప్లైస్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలకుగాను ఈ నెల 12కల్లా 6,919 కేంద్రాలు తెరిచామని, 1.87 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.

అధిక తేమతోనే తంటాలు

‘‘ధాన్యంలో తేమ 17 శాతం దాటొద్దు. కొందరు రైతులు వడ్లను ఆరబెట్టకుండా 40-50 శాతం తేమతో తెస్తున్నారు. 40 శాతం తేమ ఉంటే రెండ్రోజుల్లో 100 కిలోల తూకం 78 కిలోలకు తగ్గుతుంది. కొన్నిచోట్ల గింజలూ పూర్తిగా ఏర్పడకముందే పంట కోస్తున్నారు. జనగామ మార్కెట్‌ యార్డులో ఒక కేంద్రం ఉంటే రెండుకు పెంచాం. సోమవారం నుంచి క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్తున్నా. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలుంటే ఇక్కడి రైతులు అక్కడికి ధాన్యాన్ని తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని మాత్రం తెలంగాణకు రానివ్వం.

మిల్లర్లకు వెళ్లిన గన్నీ సంచులెన్ని, వచ్చినవెన్నో విచారణ జరుపుతాం

మిల్లర్‌కు వెళ్లే ప్రతి గన్నీ బస్తా కార్పొరేషన్‌కు తిరిగిరావాలి. కానీ, కొన్నేళ్లుగా పాత గన్నీ బస్తాలు వెళ్లినవి ఎన్ని, వచ్చినవి ఎన్నో లెక్కలు తేల్చలేదు. దీనిపై విచారణ జరుపుతాం. మిల్లర్లకు నోటీసులు ఇస్తాం. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల అడ్డుకట్టకు ఐరిస్‌ నిబంధనపెట్టాం. దీనిపై రైతుల్లో ఏదైనా ఆందోళన ఉంటే.. పాత విధానమైన ఓటీపీ ద్వారా కొంటాం. వడ్లు తీసుకుని బియ్యం ఇవ్వని ఓ రైస్‌మిల్లు యజమాని దుబాయ్‌కి పారిపోయాడు. ఎంతదూరం పోయినా వదలం. మిల్లర్లకు ధాన్యం ఇవ్వడంలో విధానపరమైన మార్పులపై దృష్టిపెట్టాం. బ్యాంకు గ్యారంటీ నిబంధనపై ఆలోచిస్తున్నాం. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యాక ప్రభుత్వంతో చర్చించి కార్యాచరణ చేపడతాం. ధాన్యం కొన్ని మిల్లులకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ కేటాయింపుల ఫిర్యాదుపై విచారణకు ఆదేశించాం’’ అని చౌహాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని