సమస్య లేకుండా తాగునీటి సరఫరా

రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ వేసవిలో ఎద్దడి తలెత్తకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలిపారు.

Published : 14 Apr 2024 03:36 IST

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా

న్యూస్‌టుడే, తాండూరు, యాలాల: రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ వేసవిలో ఎద్దడి తలెత్తకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం బెన్నూరు గ్రామ పరిధిలోని కాగ్నానది నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌కు తాగునీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌ను ఆయన పరిశీలించారు. వెంట వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మిషన్‌ భగీరథ అధికారులున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సుల్తానియా మాట్లాడారు. ఎల్లంపల్లి, నిజాంసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి మిషన్‌ భగీరథ కింద 1.50లక్షల కి.మీ.పైప్‌లైన్‌తో రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికీ నీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌, ఎల్లంపల్లి రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీకి చేరువలో ఉన్నా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అదనంగా 50ఫీడర్లను వినియోగిస్తున్నామని చెప్పారు. 

15 శాతం అధికంగా...

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోజూ సరఫరా చేసే నీటి కంటే 15 శాతం అదనంగా అందిస్తున్నామని సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ 11న 1,889 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తే ప్రస్తుతం ఈ ఏడాది  2,200 ఎంఎల్‌డీ నీటిని అందించామన్నారు. భగీరథ తాగునీటి సరఫరా పైపులైన్లు మరమ్మతుకు గురైతే రోజు వ్యవధిలోనే పూర్తి చేస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మిషన్‌ భగీరథ అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని