రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?

రైస్‌మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌(సీఎంఆర్‌) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.

Published : 14 Apr 2024 03:37 IST

2.48 లక్షల టన్నులు తిరిగివ్వని మిల్లర్లు
తదుపరి చర్యలపై అధికారుల మీనమేషాలు

ఈనాడు, హైదరాబాద్‌: రైస్‌మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌(సీఎంఆర్‌) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. పలు వాయిదాల అనంతరం జనవరి నెలాఖరుతో గడువు ముగిసినప్పటికీ 2022-23 వానాకాలం పంటకు సంబంధించి 2.48 లక్షల టన్నుల బియ్యం ఇంకా రాలేదు. అందులో 1.55 లక్షల టన్నుల బియ్యం ఐదు జిల్లాల మిల్లర్ల నుంచే బకాయి ఉంది. అత్యధికంగా వనపర్తి నుంచి 63,112 టన్నులు, నాగర్‌కర్నూల్‌ 25,620, కామారెడ్డి 23,078, సూర్యాపేట 22,396, మెదక్‌ నుంచి 21,447 టన్నులు రావాలి. ఈ బియ్యం విలువ దాదాపు రూ.800 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం.

 జరిమానా వసూలులోనూ జాప్యం..

పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద రైస్‌ మిల్లులకు ఇస్తుంది. ధాన్యాన్ని మరాడించిన తర్వాత క్వింటాలుకు 65-67 కిలోల బియ్యాన్ని మిల్లులు ఎఫ్‌సీఐ లేదా రాష్ట్ర కోటాకు ఇవ్వాల్సి ఉంటుంది. చివరి గడువు తర్వాత కూడా ఇవ్వనిపక్షంలో 25 శాతం జరిమానా విధించేలా పౌరసరఫరాల సంస్థ నిబంధనలున్నాయి. మిల్లులో ధాన్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే బియ్యం తిరిగి రాబట్టడంతోపాటు 25 శాతం జరిమానా విధించాలి. ధాన్యం లేదని తేలితే బియ్యం విలువకు అదనంగా 25 శాతం జరిమానా విధించి..నగదు రూపంలో వసూలుచేసే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం బియ్యం బకాయి ఉన్న మిల్లుల్లో ధాన్యం నిల్వలు దారి మళ్లాయని గుర్తించినట్టు సమాచారం. మరోవైపు సీఎంఆర్‌ గడువు జనవరి నెలాఖరులోనే ముగిసినా జరిమానా వసూలు ప్రక్రియను అధికారులు ప్రారంభించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని