మాదిగలకు అండగా ఉంటాం

మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, లోక్‌సభ ఎన్నికల తరవాత వారికి రాజకీయ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 14 Apr 2024 03:39 IST

ఎన్నికల తర్వాత రాజకీయ పదవుల్లో సముచిత స్థానం
ఎమ్మార్పీఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ హామీ

ఈనాడు, హైదరాబాద్‌: మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, లోక్‌సభ ఎన్నికల తరవాత వారికి రాజకీయ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, ఇతర నేతలు శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని సీఎం ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరగా.. ఎన్నికల కోడ్‌ తరవాత చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు సీఎం మద్దతు: పాపయ్య మాదిగ

తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాదిగలకు రాజకీయంగా ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్‌రెడ్డి అన్నారని పాపయ్య మాదిగ తెలిపారు. ‘‘మాదిగలకు లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వవద్దని ఎవరు చెప్పినా తాను వినే మనిషిని కాదని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి తన పూర్తి మద్దతు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసులో సీనియర్‌ న్యాయవాదిని నియమించి వాదనలు పటిష్ఠంగా జరిగేలా చూడాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ నేతృత్వంలో బృందాన్ని దిల్లీకి పంపినట్లు చెప్పారు’’ అని పాపయ్య మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, నేతలు గుర్రాల శ్రీనివాస్‌, కొండ్రు శంకర్‌, కేదాసి మోహన్‌, చింతబాబు, ఎం.శ్రీనివాస్‌, మేడి రమణ తదితరులు పాల్గొన్నారు. 

విద్యుత్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేతలు శనివారం సీఎం నివాసానికి వెళ్లి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల అనంతరం ఈ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని