అందరివాడు అంబేడ్కర్‌

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఆయన విగ్రహానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated : 15 Apr 2024 06:30 IST

బాబాసాహెబ్‌కు గవర్నర్‌తోపాటు ముఖ్యమంత్రి, నాయకుల నివాళులు
జైభీమ్‌ నినాదాలతో హోరెత్తిన ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు

ఈనాడు, హైదరాబాద్‌- బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఆయన విగ్రహానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ‘జై భీమ్‌’ నినాదాలు చేశారు.  ‘అందరివాడు అంబేడ్కరుడు.. భారతావనిన ఉదయించిన భాస్కరుడు’ అని ‘ఎక్స్‌’లోనూ పోస్టు చేశారు. అలాగే కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగ, ఎంపీలు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, భారాస సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి టి.పద్మారావు, కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, సిరిసిల్ల రాజయ్య, అజీజ్‌పాషా, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర మాల సంఘాల ఐకాస ఛైర్మన్‌ చెరుకు రాంచందర్‌, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు నివాళులర్పించారు. అంబేడ్కర్‌ జయంతి నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు నీలిమయమయ్యాయి.


రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి: కేటీఆర్‌

సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో  నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘అంబేడ్కర్‌ చెప్పినట్లుగా.. బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ.. 14 ఏళ్ల పాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో కొనసాగించాం. స్వరాష్ట్రంలో అంబేడ్కర్‌ ఆశయాల మేరకు పదేళ్లపాటు మా ప్రభుత్వం పనిచేసింది. 125 అడుగుల బాబాసాహెబ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని