దేశ ఆర్థికాభివృద్ధిలోనూ అంబేడ్కర్‌ పాత్ర కీలకం

ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలోనూ అంబేడ్కర్‌ కీలక పాత్ర పోషించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే పేర్కొన్నారు.

Updated : 15 Apr 2024 05:43 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలోనూ అంబేడ్కర్‌ కీలక పాత్ర పోషించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, మహిళలకు సమానత్వ హక్కుల కోసం ఆయన కృషి చేశారన్నారు. రిజర్వు బ్యాంకు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ఫైనాన్స్‌, ప్లానింగ్‌ కమిషన్లను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో పొందుపర్చడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసిన దార్శనికుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ హాలులో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ కృషి చేశారని తెలిపారు. కులవివక్ష నిర్మూలనపై పోరాటం చేశారన్నారు. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్యాంకోశీ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఏర్పాటు చేసిన వ్యవస్థల కారణంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినా.. మన దేశంలో సుస్థిరత ఉందన్నారు. ఆయన అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు పోరాటం చేసిన నిజమైన స్వాతంత్య్ర యోధుడని అభివర్ణించారు. జస్టిస్‌ ఎం.గిరిజా ప్రియదర్శిని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అందరికీ చెందినవారని అన్నారు. లింగ, కుల వివక్షలపై పోరాటం చేశారన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి మాట్లాడుతూ విలువల విషయంలో అంబేడ్కర్‌ ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. సుమేధ బోధి రచించిన ‘సామాజిక బౌద్ధ ధమ్మం’ పుస్తకాన్ని సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ మాధవీదేవి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌, జస్టిస్‌ లక్ష్మీనారాయణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు ఉప్పాల శాంతిభూషణ్‌రావు, జి.సంజీవరావు, సంయుక్త కార్యదర్శి వి.నవీన్‌కుమార్‌, బార్‌ కౌన్సిల్‌ వైస్‌ఛైర్మన్‌ సునీల్‌గౌడ్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు