క్రమశిక్షణ.. రుణ నియంత్రణ..!

పాత బాకీలపై వడ్డీ, అసలు కింద కిస్తీలకు సొమ్ము చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. గత 4 నెలల్లో రూ.25,911 కోట్లు ఇలా కిస్తీలకు చెల్లించింది.

Published : 15 Apr 2024 04:57 IST

రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రభుత్వ నిర్దేశం
4 నెలల్లో కొత్త అప్పులు రూ.17,618 కోట్లు
పాత బాకీలకు చెల్లింపు రూ.25,911 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: పాత బాకీలపై వడ్డీ, అసలు కింద కిస్తీలకు సొమ్ము చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. గత 4 నెలల్లో రూ.25,911 కోట్లు ఇలా కిస్తీలకు చెల్లించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 4 నెలల్లో కొత్తగా రూ.17,618 కోట్ల రుణాలను సేకరించింది. కానీ పాతబాకీల కిస్తీలకు చెల్లింపు అంతకుమించి ఉండటంతో ప్రభుత్వం వ్యయంపై పలు నియంత్రణలతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం దుబారా నివారణ, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని నిర్దేశించింది.

ప్రజోపయోగమైన పనులకూ ప్రాధాన్యం

పాతబాకీలకు సొమ్ము చెల్లింపులే కాకుండా ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు గత 4 నెలల్లో మరో రూ.5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేశారు. బడ్జెట్‌ పరిమితులకు లోబడి మార్కెట్‌ రుణాలు తీసుకొని ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. కొత్త అప్పులు తీసుకోవడంలో కొంతమేరకు నియంత్రణ సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2023 డిసెంబరు నుంచి మార్చి వరకూ నాలుగు నెలల్లో రూ.15,118 కోట్లు అప్పుగా తీసుకుంది. భారాస హయాం(2022-23)లో ఇదే 4 నెలల వ్యవధిలో రూ.19,569 కోట్లు, 2021-22లో రూ.26,995 కోట్ల అప్పులు తీసుకున్నట్లు ఆర్థికశాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఏడాది 2024-25 ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్లో రూ.59,625 కోట్ల రుణాలను సేకరించాలని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) పెరిగినందున రుణాలు తీసుకునే పరిమితి పెరిగింది. అయినప్పటికీ తక్కువగానే అప్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రభుత్వాలు పాతబాకీలకు చెల్లించాల్సిన కిస్తీల సొమ్ము కంటే ఎక్కువ మొత్తాన్ని రుణాలుగా తీసుకోవడం ఆనవాయితీ. కానీ గత 4 నెలల్లో అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త రుణాల కంటే ఎక్కువ సొమ్మును పాత అప్పుల కిస్తీలకు చెల్లించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని