ఇక డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు ‘డ్రంకెన్‌ డ్రైవ్‌’ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 16 Apr 2024 05:51 IST

డోర్నకల్‌, గార్ల, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు ‘డ్రంకెన్‌ డ్రైవ్‌’ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాగిన మత్తులో జరిగే ప్రమాదాల నివారణ, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావడం దీని ముఖ్యోద్దేశం. ఇదే తరహాలో ఇప్పుడు డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలను రాష్ట్ర పోలీస్‌ శాఖ తెరపైకి తెచ్చింది. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ‘ఎబోన్‌ యూరిన్‌ కప్‌’ యంత్రంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌) ఈ పరీక్షల కిట్‌ను సమకూర్చింది. అన్ని పోలీస్‌ ఠాణాలకు పంపింది. సదరు పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని ఠాణాల పరిధిలో తనిఖీలు మొదలయ్యాయి. డోర్నకల్‌ సీఐ ఉపేంద్రరావు, ఎస్సై సంతోష్‌రావు సోమవారం డోర్నకల్‌లో డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. గార్ల ఎస్సై జీనత్‌కుమార్‌ రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ పరిసరాల్లో అనుమానంగా తిరుగుతున్న యువకులకు పరీక్షలు నిర్వహించారు. ‘గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన పక్షంలో ఈ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తాం. పరికరంలో రెండు ఎర్ర గీతలు కన్పిస్తే ‘నెగెటివ్‌’గా, ఒకటే గీత కన్పిస్తే ‘పాజిటివ్‌’గా పరిగణిస్తాం. పాజిటివ్‌గా తేలితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటాం. అవసరమైతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం’ అని డోర్నకల్‌ సీఐ ఉపేంద్రరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు