ఠాణాలో జడ్పీటీసీ సభ్యురాలి భర్త నృత్యం.. వీఆర్‌కు ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ పోలీసుస్టేషన్‌లో సోమవారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ సభ్యురాలు అరుణ భర్త గుడాల శ్రీనివాస్‌ నృత్యం చేయడం వివాదాస్పదమైంది.

Published : 16 Apr 2024 05:13 IST

వేరే కారణాలతో మరో ఏడుగురు కానిస్టేబుళ్ల బదిలీ

మహదేవపూర్‌, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ పోలీసుస్టేషన్‌లో సోమవారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ సభ్యురాలు అరుణ భర్త గుడాల శ్రీనివాస్‌ నృత్యం చేయడం వివాదాస్పదమైంది. ఉదయపు నడకకు వెళ్లిన ఆయన దారిలో పోలీసుస్టేషన్‌ కనిపించడంతో లోనికి వెళ్లారు. పరిచయస్థులైన పోలీసు సిబ్బందితో మామూలుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాయామం, నృత్యం గురించి చర్చ రావడంతో సినిమా పాట పెట్టి డ్యాన్స్‌ చేసి చూపించారు. పోలీసులు కూడా ఆయన్ను ప్రోత్సహిస్తూ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్పీ కిరణ్‌ ఖరే చర్యలకు ఉపక్రమించారు. ఎస్సై కె.ప్రసాద్‌ను వీఆర్‌కు అటాచ్‌ చేయగా.. స్టేషన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఠాణాలో వివిధ ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఏడుగురు కానిస్టేబుళ్లకు కూడా స్థానచలనం కల్పించారు. ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచేలా సిబ్బంది పనితీరు ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఘటనపై గుడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం ఉదయం నడుస్తా. ఒత్తిడిని జయించడానికి నృత్యం కూడా చేస్తుంటా. వీటిపై తెలిసినవారికి అవగాహన కల్పిస్తుంటా. పోలీసు సిబ్బందిని కలిసినప్పుడు శారీరక, మానసిక ఒత్తిడిని జయించడానికి నృత్యం మంచి సాధన అని చెబుతూ డ్యాన్స్‌ చేసి చూపించా. కొంతమంది దీన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేశారు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని