అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా ఫుడ్‌పార్కు

మార్కెట్‌యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Published : 17 Apr 2024 03:12 IST

మార్కెట్‌యార్డుల్లో రైతులకు వసతులు కల్పించాలి
లక్ష్యం చేరని ఆయిల్‌పామ్‌ సంస్థలపై చర్యలు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: మార్కెట్‌యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆయిల్‌పామ్‌ సంస్థలు మూడేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలవారీగా కంపెనీల పనితీరును సమీక్షించి సరైన పురోగతి లేని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల బుగ్గపాడులో 60 ఎకరాల్లో రూ.109.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రస్థాయిలో మెగా ఫుడ్‌పార్కును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌, కొబ్బరి, మామిడి శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని.. పూర్తిస్థాయిలో కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు, ప్యాకింగ్‌ హౌస్‌, గిడ్డంగులు, శిక్షణ కేంద్రం, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దాలన్నారు. అందులో యూనిట్ల స్థాపనకు పలు కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని.. ఇప్పటికే ఆరు ముందుకొచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యాన పథకాలను సైతం ఈ పార్కు అభివృద్ధికి వినియోగించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని