హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావు

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Published : 17 Apr 2024 04:47 IST

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ ఆమోదం తెలపగా, వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగంపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబమైన జె.మాణిక్యరావు, లక్ష్మీబాయి దంపతులకు 1969 ఆగస్టు 31న జన్మించారు. లింగంపేటలో పాఠశాల విద్యాభ్యాసం, గంభీరావుపేటలో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌ భవన్స్‌ న్యూసైన్స్‌ కాలేజీలో బీఏ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1999లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయి.. హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. జిల్లా కోర్టులతోపాటు ట్రైబ్యునళ్లలో కూడా ప్రాక్టీస్‌ చేశారు. రిట్‌, సర్వీస్‌, నాన్‌సర్వీస్‌, సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో వాదనలు వినిపించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

నామవరపు రాజేశ్వర్‌రావు: మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లిలో ఎన్‌.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్‌ 30న జన్మించారు. వరంగల్‌ సరస్వతి శిశుమందిర్‌లో పాఠశాల విద్య, గోవిందరావుపేటలో కాలేజీ విద్య, పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 2001లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయి హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తెలంగాణలో యూజీసీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రైబ్యునల్‌ ప్యానెల్‌ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందించారు. సివిల్‌, ఆర్థికనేరాలు, కార్పొరేట్‌ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని