సంక్షిప్త వార్తలు(4)

తెలంగాణలో 45 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీని ఇవ్వాలని పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం కోరింది. పీఆర్‌సీలో పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని అభ్యర్థించింది.

Updated : 17 Apr 2024 05:47 IST

45 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి 

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణలో 45 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీని ఇవ్వాలని పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం కోరింది. పీఆర్‌సీలో పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మోహన్‌ నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సరాజుల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్‌టీజీవోల నేతలు శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్‌సీ ప్రతిపాదనలను సమర్పించారు. విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తీసుకునే కమ్యుటేషన్‌ను 12 ఏళ్ల వాయిదాలతో చెల్లించే విధానం ఉండాలని వారు కోరారు.


బాబ్లీ కేసు విచారణ 23కు వాయిదా

బోధన్‌ గ్రామీణం, పెద్దపల్లి, న్యూస్‌టుడే: బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలీ కోర్టులో మరోసారి ఈ నెల 23కు వాయిదా పడింది. మంగళవారం జరిగిన విచారణకు.. కరీంనగర్‌, పెద్దపల్లి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, చింతకుంట విజయరమణారావు, ప్రకాశ్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, కేఎస్‌ రత్నం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్‌బాబు తదితరులు హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సహా 9 మంది నాయకులు కేసు విచారణకు హాజరు కాలేదు. 


కార్పొరేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రాకుండానే ప్రవేశాల పేరిట రూ.లక్షలు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు, అకాడమీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి, టి.నాగరాజు మంగళవారం ఇంటర్మీడియట్‌ బోర్డు శృతిఓజాను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు సెలవుల్లో పీఆర్‌సీవోలను, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను పెట్టి ముందస్తు ప్రవేశాలు చేపడుతున్నారని, మొదటి ఏడాది పరీక్షలు పూర్తైన వెంటనే రహస్యంగా తరగతులను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


ఐపీఎస్‌ సెంట్రల్‌జోన్‌ అధ్యక్షుడిగా విద్యాసాగర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫైటోపాథలాజికల్‌ సొసైటీ(ఐపీఎస్‌) సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షునిగా విద్యాసాగర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.కె.బిశ్వాస్‌ మంగళవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ప్రస్తుతం ఆయన రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాలలో ప్లాంట్‌ పాథాలజీ విభాగం అధినేతగా పనిచేస్తున్నారు. ఈ సొసైటీ పంట తెగుళ్లపై పరిశోధనలను నిర్వహిస్తోంది. రాజేంద్రనగర్‌లోని చిరుధాన్యాల పరిశోధనల శాస్త్రవేత్త జి.రాజేశ్‌ జోనల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని