కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేం

ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) కేటగిరిలోని స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 17 Apr 2024 03:32 IST

ఎస్జీటీ ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల నియామకంపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) కేటగిరిలోని స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక స్థాయిలో 796 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షల్లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితరులకు 45 శాతం మార్కులతోపాటు డీఈడీ ఉండాలన్న ఎన్‌సీటీఈ నిబంధనలను, దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న జారీ చేసిన జీవో 4ను సవాలు చేస్తూ రిసోర్స్‌ పర్సన్‌లు కె.విజయచారి మరో 10 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ప్రభుత్వం ఓసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులుగా నిర్దేశిస్తూ జీవో 1 జారీ చేసిందన్నారు. ప్రస్తుతం ఈ జీవోను పరిగణనలోకి తీసుకోకుండా కనీస అర్హత మార్కులను నిర్దేశించడం చట్టవిరుద్ధమన్నారు. 2007 తరువాత డీఈడీలో చేరిన ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించని అభ్యర్థులకు ఇదే హైకోర్టు అనుకూల ఉత్తర్వులు జారీ చేసిందని, పిటిషనర్లకు కూడా వీటిని వర్తింపజేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం నోటిఫికేషన్‌ నిబంధనల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని