సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?

ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Published : 18 Apr 2024 06:28 IST

కలెక్టర్లు కరుణించినా కదలని దస్త్రాలు
ధరణి రిజిస్ట్రేషన్ల క్యాన్సిలేషన్‌ రుసుం పొందడానికి ఇబ్బందులు
‘జీవో 59’ కింద తిరిగి ఇవ్వాల్సిన వాటికీ ఇక్కట్లే

ఈనాడు, హైదరాబాద్‌: ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2020 నవంబరు రెండో తేదీ నుంచి ధరణి ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవలు కొనసాగుతున్నాయి. వారసత్వ బదిలీ, జీపీఏ, బహుమతి తదితర సేవలు కూడా ఇదే పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న స్లాట్‌ రద్దు చేసుకుంటే.. ప్రభుత్వానికి చెల్లించిన రుసుం వెనక్కు రావడం లేదు. మ్యుటేషన్‌ ఫీజు ఎకరానికి రూ.2,200తోపాటు సర్వే నంబరు ప్రకారం చెల్లించిన భూమి రిజిస్ట్రేషన్‌ రుసుం ప్రభుత్వం వద్దనే ఉండిపోతోంది. ఇలా ఐదేళ్ల నుంచి రూ.కోట్లలో పెండింగ్‌ పడింది. 2022లో కొందరు కలెక్టర్లు తమకు అందిన అర్జీల మేరకు విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే తిరిగి చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ల ఖాతా ద్వారా ఆ మొత్తం బాధితులకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. 

కదలిక వచ్చినా...

సేవలను రద్దు చేసుకున్న కేసులు పెరిగి పోతున్న పరిస్థితులలో ప్రభుత్వం మూడు నెలల క్రితం ఒక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. బాధితులు కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. జిల్లా కలెక్టర్‌ ధరణి లాగిన్‌ నుంచి ఆ క్లెయిమ్‌లను పరిశీలించి, అనంతరం ఖజానా శాఖ ద్వారా నిర్దిష్ట మొత్తాన్ని వెనక్కు అందించేలా ఏర్పాట్లు చేసింది. చాలా మంది బాధితులకు దీనిపై సరైన అవగాహన లేదు. పైగా, కలెక్టరేట్‌లో క్లియర్‌ అయినా ఖజానా శాఖ నుంచి బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. దస్త్రం ఎక్కడ.. ఎందుకు ఆగిందో తెలియట్లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం వెనక్కు ఇవ్వాల్సిన సొమ్ముకు సులువైన విధానాన్ని అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.


జీవో 59 కింద నాడు 3,145 దరఖాస్తుల తిరస్కరణ

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 59 కింద రుసుం చెల్లించగా అర్హతలేక తిరస్కారానికి గురైన వారికి తిరిగి చెల్లింపులు ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నాయి. 2014లో చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియలో 125 చదరపు గజాలకు పైగా విస్తీర్ణం ఉన్న స్థలాలకు ఈ జీవో కింద 17,065 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3,145 దరఖాస్తుల్ని క్రమబద్ధీకరణకు అర్హమైనవి కానివిగా తేల్చి రెవెన్యూశాఖ తిరస్కరించింది. వారు చెల్లించిన రూ.63.31 కోట్లను తిరిగి ఇచ్చేయాల్సి ఉన్నా వివిధ కారణాలు చూపి కొందరి డబ్బులు పెండింగ్‌లో పెట్టింది. హైదరాబాద్‌, గద్వాల, మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొంత మందికి తిరిగి చెల్లించారు. మిగిలిన వారు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరిగిపోతున్నారు. పైగా గతేడాది మరోమారు చేపట్టిన ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు తాము దరఖాస్తు చేసుకోగా 2014లో చెల్లించిన డబ్బులను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని