సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం

ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్‌ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం

Updated : 18 Apr 2024 08:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్‌ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం. దీంతో వారికి పాస్‌పోర్టు జారీ మరింత ఆలస్యమవుతోంది..

రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పీవో పీఎస్‌కేలు ఉండగా రోజూ 3,800కి పైగా అపాయింట్‌మెంట్ల ప్రక్రియ సాగుతోంది. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం, ఆధార్‌, దరఖాస్తులో వివరాలు వేర్వేరుగా ఉండడం తదితర కారణాలతో 10శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలాంటి వారు ఆయా సేవా కేంద్రాల్లో మళ్లీ ఇచ్చే అపాయింట్‌మెంట్‌ తేదీ లోపు అధికారులు సూచించిన వివరాలతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది దరఖాస్తుదారులు మాత్రం.. అధికారులు సూచించిన తేదీని పట్టించుకోకుండా ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రంలో ఎంక్వయిరీ అపాయింట్‌మెంట్లు తీసుకొని అక్కడ ధ్రువపత్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తీరా సర్టిఫికెట్లు తీసుకొని అక్కడికి వెళ్లాక తదుపరి ప్రక్రియను అక్కడ పూర్తి చేయరని తెలియడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలోనే రీజనల్‌ పాస్‌పోర్టు అధికారులు వారికి అదే పీఎస్‌కేలో మరో అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో...

దరఖాస్తుదారులు హడావుడిగా దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేస్తుండడంతో పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకోవడానికి ‘ఎడిట్‌’ ఆప్షన్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఎడిట్‌ ఆప్షన్‌తో సంబంధం లేకుండానే ధ్రువపత్రాల పరిశీలన, సమర్పణ సమయంలోనే వాటిని ఎడిట్‌ చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏఆర్‌ఎన్‌, ధ్రువపత్రాలు సమర్పించే సమయంలో అదనపు కాపీలను తమ వద్ద పెట్టుకొని పొరపాట్లు జరిగినచోట పెన్సిల్‌తో మార్క్‌ చేసి పత్రాలను పరిశీలించి మార్పులు చేయాలని కోరవచ్చు. ఒరిజినల్స్‌ను అధికారులు పరిశీలించి అక్కడికక్కడే వాటిని సరిదిద్దుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని