చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్‌

రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి.

Published : 18 Apr 2024 06:29 IST

గిరిజన గూడేల్లో తాగునీటి ఎద్దడి తీవ్రం
భగీరథ పైపులైన్లు ఉన్నా.. సరఫరా లేదు
అద్దె బావుల నుంచి సరఫరాకు అధికారుల ప్రణాళికలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో ఏజెన్సీ ప్రాంతాల్లోని వందల సంఖ్యలోని ఆవాసాల్లో ఈ పరిస్థితి ఉంది. గిరిజన గూడేలకు మిషన్‌ భగీరథ పైపులైన్లు వేసినా.. వాటి ద్వారా రక్షితనీటి సరఫరా లేదు. దీంతో గూడేల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్ని గిరిజన గూడేలకు తాగునీటి పైపులైన్లు వేసినా ఒక్కసారి కూడా సరఫరా జరగకపోవడంతో ఏడాది పొడవునా వాగులు, బావుల్లోని నీరే ఆధారమవుతోంది. గిరిజన గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని గిరిజన సంక్షేమశాఖ సమీక్షించింది. ఎద్దడి నివారణకు జిల్లా కలెక్టర్లు, నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

ఆవాసాలకు సౌకర్యాలేవీ?

రాష్ట్రంలోని ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధుల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. గతేడాది దాదాపు 140 ఆవాసాల పరిధిలో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించినప్పటికీ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా ఉంటుందని గిరిజన సంక్షేమశాఖ అంచనా వేస్తోంది. ఐటీడీఏల పరిధుల్లోని ఏజెన్సీ గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటి పైపులు వేసినా.. వాటికి అనుబంధంగా ఉన్న ఆవాసాలకు ఆ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. దాదాపు 237 గ్రామాల పరిధిలో రక్షిత తాగునీటి సరఫరా పనులు పూర్తి కాలేదు.

  • ఉట్నూరు ఐటీడీఏలోని గిరిజన ఆవాసాలకు తాగునీరు అందించే ధనోరా ప్లాంటు పూర్తయినా.. సరఫరా జరగడం లేదు. ఈ ప్లాంటు ద్వారా 935 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక చేసినా నిర్మాణ, డిజైన్‌ లోపాలతో పంపింగ్‌ చేయలేకపోతున్నారు. కొండల మీదుగా వేసిన పైపులైన్లలో లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్లాంటులో మోటార్ల మరమ్మతులు, పంపింగ్‌కు విద్యుత్‌ సమస్యలు ఉన్నాయి. కెరమెరి ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని ఆవాసాలకు పైపులైన్లు వేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారీ సరఫరా జరగలేదు. దీంతో కొలాంగూడ, భీమనగొంది, సుద్దఘాట్‌, సమతుల గుండం తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు చెలమలు, కాలువల్లోని నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తున్నారు.
  • ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకున్నా.. మిగతా ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడి నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల్లోని బోర్లకు మరమ్మతులు చేపట్టారు. గంగారం మండలంలోని పలు గ్రామాల్లో 30కి పైగా బోర్లు, బావులను సంబంధిత యజమానుల నుంచి అద్దెకు తీసుకున్నారు. వీటి నుంచి ప్రజలకు నీరు సరఫరా చేయాలని నిర్ణయించారు.
  • మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో 28 ఆవాసాల్లో బోర్లు వేయించి.. సోలార్‌ మోటార్లు బిగించారు. వీటిలో కొన్ని ప్రస్తుతం దెబ్బతిన్నాయి. మరమ్మతులు పూర్తయితే గిరిజన ఆవాసాల ప్రజల తాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి.

ఐటీడీఏ పీవోలు సొంత నిర్ణయాలు తీసుకోలేక..

గతంలో ఐటీడీఏ స్వతంత్రంగా వ్యవహరించేది. ప్రాజెక్టు అధికారి(పీవో) ఆధ్వర్యంలో పరిపాలన యంత్రాంగం పనిచేసేది. విద్య, వైద్యం, నీటిసరఫరా తదితర విభాగాలన్నీ ప్రత్యేకంగా ఉండేవి. జిల్లాల పునర్విభజన తరువాత ఐటీడీఏ పరిధి నాలుగైదు జిల్లాలకు విస్తరించింది. ప్రాజెక్టు అధికారి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. మిషన్‌ భగీరథ ఏర్పాటుకు ముందు ఐటీడీఏ పరిధిలో అంతర్భాగంగా ఉండే గ్రామీణ నీటిసరఫరా విభాగం..  ప్రస్తుతం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. దీంతో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాజెక్టు అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సంబంధిత జిల్లా మిషన్‌ భగీరథ అధికారులకు ఆదేశాలు ఇప్పించాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని