సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది.

Published : 18 Apr 2024 06:29 IST

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధుర క్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయంలోని మిథిలా మండపంలో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ మహోత్సవానికి విష్వక్సేనుల ఆరాధన, పుణ్యాహవచనంతో శ్రీకారం చుట్టారు. సీతారాములకు రక్షాసూత్రాలు కట్టి.. గృహస్థాశ్రమసిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మూడు పతకాలు కలిగిన మాంగల్యాన్ని సీతమ్మ మెడలో ధరింపజేయడంతో కల్యాణ ప్రాంగణం భక్తుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. అనంతరం తలంబ్రాల ఘట్టం నయనానందకరంగా సాగింది. సీతారాముల వారి కల్యాణ తలంబ్రాల విశిష్టతపై సాగిన వేద పండితుల ప్రవచనాలు ఆధ్యాత్మికజ్ఞానాన్ని పంచాయి. ‘సర్వలోకాలకు రక్షకుడు రాముడు. అలాంటి పరమాత్మకు జరిగే కల్యాణమే లోకకల్యాణం.  ఆయన సేవే మనకు పరమానందం’ అని దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి ప్రవచించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన ఉన్నతాధికారులు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎస్‌ శాంతికుమారి దంపతులు, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరీ పీఠం, చినజీయర్‌ స్వామి, భక్త రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌ల తరఫున వారి ప్రతినిధులు పట్టువస్త్రాలు బహూకరించారు.

విచ్చేసిన ప్రముఖులు

సీతారాముల కల్యాణ వేడుకను కనులారా చూసి తరించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌, జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ జగడం సుమతి తదితరులు కల్యాణాన్ని వీక్షించారు.


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం
- మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కల్యాణోత్సవానికి హాజరయ్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని రాములవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ కారణంగా సామాన్య భక్తుల మాదిరిగానే టికెట్‌ కొని కల్యాణం తిలకించామన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడగలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాముల వారి దయతో రాష్ట్రంలో సకలజనులందరికీ ఇందిరమ్మ పాలన అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ తరఫున ఆయన కుమారుడు నయన్‌రాజ్‌.. స్వర్ణంతో పొదిగిన పచ్చలహారాన్ని సీతారాముల వారికి బహూకరించారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఐజీలు రంగనాథ్‌, రాజేశ్‌, సింగరేణి ఎండీ బలరాం, తితిదే మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కిషన్‌, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు కల్యాణోత్సవానికి హాజరైన వారిలో ఉన్నారు.

 ఈటీవీ, ఖమ్మం - న్యూస్‌టుడే, భద్రాచలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని