చెరువుల కబ్జాలతో ముప్పే

చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ హైకోర్టుకు లేఖ రాశారు.

Updated : 18 Apr 2024 03:18 IST

జల వనరులను కాపాడుకోకపోతే ప్రజాజీవనానికి ప్రమాదం
నీటి నిర్వహణ లోపంతో పెరుగుతున్న ఆక్రమణలు
‘ఈనాడు’ కథనంపై స్పందిస్తూ జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ లేఖ|
ప్రజాప్రయోజన వ్యాజ్యంగా  స్వీకరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ హైకోర్టుకు లేఖ రాశారు. నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో, అభివృద్ధి పేరుతో ఆక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండటం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఈనాడు’లో మార్చి 21న ‘నాలాల్లో నిర్మాణాలు.. చెరువుల్లో విల్లాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ ఈ లేఖ రాశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లోని 90కి పైగా చెరువులు, కుంటలు  ఆక్రమణలకు గురైనట్లు ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌, జిన్నారం, పటాన్‌చెరు, ఆర్‌.సి.పురం మండలాల్లో 69 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, సంగారెడ్డి; నర్సాపూర్‌ నియోజకర్గంలోని హత్నూర మండలాల్లో 20కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్నిచోట్ల చెరువుల్లో మట్టి నింపి ఏకంగా 14 అంతస్తులతో భవనాలు నిర్మించగా.. అమీన్‌పూర్‌ మండలంలోని ఉప్పరవానికుంటలో మొత్తం 6.11 ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది. మున్సిపల్‌, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేక ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి వనరులను ఆక్రమించుకుంటున్నారు. ఈ మేరకు చెరువులను ఆక్రమించి విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రచురితమైన కథనంపై న్యాయమూర్తి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆర్థికాభివృద్ధి తీరు, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమార్కులు చట్టవిరుద్ధంగా చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తుండటం వల్ల ప్రజాజీవనం స్తంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, నాలాలు, వ్యవసాయ పొలాల్లో నిర్మాణాల వల్ల సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. చెరువుల, నదీ పరీవాహక ప్రాంతాల ఆక్రమణలవల్లనే హైదరాబాద్‌ సహా దేశంలోని పలు నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా చెట్లు కూడా ఉండటం లేదని, దీనివల్ల స్వచ్ఛమైన గాలి సమస్య కూడా ఉందన్నారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల వర్షాభావం లేదా అధిక వర్షపాతం వంటివి సంభవిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా నీటి వనరుల్లో సాగుతున్న ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి; పురపాలక, నీటి పారుదల, రెవెన్యూ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్‌ఎండీఏ లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ; హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను పేర్కొంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని