ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి.

Updated : 18 Apr 2024 11:00 IST

ఏటా భారీగా రుసుముల పెంపు 
కొన్ని పాఠశాలల్లో ప్లేస్కూల్‌కు రూ.లక్ష.. ఒకటో తరగతికి రూ.2.5 లక్షలు
పుస్తకాలు, యూనిఫాంలూ బడిలో కొనాల్సిందే.. 
యాజమాన్యాల ఇష్టారాజ్యంతో తల్లిదండ్రులకు ఇబ్బందులు
ఈనాడు, హైదరాబాద్‌

  •  హైదరాబాద్‌ ఉప్పల్‌లో చిరుద్యోగి ఆనంద్‌ తన కుమార్తెను ప్లేస్కూల్‌లో చేర్పించడానికి వెళ్లారు. నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేల రుసుముతో పాటు యూనిఫాం, బూట్లు, బెల్టు, టై, ఇతరత్రా సామగ్రి కోసం రూ.12 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు చెల్లించాలని యాజమాన్యం సూచించింది.
  •  హైదరాబాద్‌ కోకాపేటలో హరినాథ్‌ తన కుమారుడిని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించేందుకు యాజమాన్యాన్ని సంప్రదించగా.. రూ.లక్షన్నర ఫీజుతో పాటు ఇతరత్రా రుసుములు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
  • వరంగల్‌లో కుమార్‌ తన కుమారుడిని మూడో తరగతిలో చేర్పించడానికి ఓ కార్పొరేట్‌ పాఠశాలకు వెళ్లారు. రూ.లక్ష డొనేషన్‌తో పాటు నెలకు రూ.8 వేల రుసుము, ఇతరత్రా ఛార్జీలు కలిపి మొత్తం రూ. రూ.2.5 లక్షలు అడిగారు.
  • రంగారెడ్డి జిల్లాలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో ఈ ఏడాది 4వ తరగతికి రూ.2.60 లక్షల రుసుము ఉంది. వచ్చే సంవత్సరం ఐదో తరగతిలో రూ.3.12 లక్షల రుసుములు చెల్లించాలని తల్లిదండ్రులకు యాజమాన్యం సందేశం పంపింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. తమ పాఠశాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ప్రభుత్వపరంగా రుసుముల నియంత్రణ లేకపోవడం వాటికి అనువుగా మారింది. 2024-25 విద్యాసంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నగరాల్లోని పలు కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం పెంచాయి.

నిర్ణీత ప్రాతిపదిక లేకుండానే..

పాఠశాలల్లో ఏటా రుసుముల పెంపు ఆనవాయితీగా మారింది. నిర్ణీత ప్రాతిపదిక ఏమీ లేకుండానే 15 నుంచి 20 శాతం వరకు పెంచేస్తున్నాయి. కరోనా తర్వాతి సంవత్సరంలోనూ పెంపుదల ఆగలేదు. డిమాండ్‌ ఉన్న పాఠశాలలు మెరిట్‌ ఉన్న విద్యార్థులకే సీట్లు ఇస్తామని చెబుతున్నా.. అవీ భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. మరోవైపు యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ధరలను పెంచేస్తున్నాయి. రూ.200కి లభించే చిన్నారుల బూట్లకు రూ.500 నుంచి రూ.1,000, మూడు జతల యూనిఫాంకు రూ.3 వేలు, బెల్టుకు రూ.300, టైకి రూ.300 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వీటిని బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నా ససేమిరా అంటున్నాయి. తాము ప్రత్యేకంగా తయారు చేయించామని, తమ పాఠశాల చిహ్నం ఉన్నందువల్ల ఇక్కడే కొనాలని కరాఖండిగా చెబుతున్నాయి. పుస్తకాలను సైతం బయటి మార్కెట్లో కొనడానికి ఒప్పుకోవడం లేదు. తాము చెప్పిన ముద్రణా సంస్థల పుస్తకాలనే కొనాలంటున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రుసుముల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారం పడుతోంది. కొందరు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా తన జీతం ఏమాత్రం పెరగలేదని, పాఠశాల రుసుములు మాత్రం 60 శాతం పెరిగాయని మంచిర్యాలకు చెందిన చిరుద్యోగి మహేందర్‌ వాపోయారు.

కార్యరూపం దాల్చని సిఫారసులు..

ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల పెంపుదలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం యాజమాన్యాలకు వరంగా మారింది. భారీ రుసుములపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది పలు సిఫారసులు చేసినా కార్యరూపం దాల్చలేదు.

నియంత్రణకు నిర్దిష్ట విధానంపై దృష్టి

ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు ప్రతిఏటా పెరుగుతున్న మాట వాస్తవమే. అది సహేతుకం కాదు. రుసుములు భారమైనా తల్లిదండ్రులు వాటిల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతుండటం వల్లే ఈ సమస్య వస్తోంది. ఇప్పటివరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు నిర్దిష్ట విధానం లేదు. మంత్రివర్గ ఉపసంఘం గతంలో పలు సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించి, ప్రభుత్వస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

బుర్రా వెంకటేశం, తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని