నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ సమావేశం రేపు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చర్చించనుంది.

Published : 18 Apr 2024 03:42 IST

మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యం కాకపోతే ఇచ్చంపల్లి నుంచి నీరు..  
గోదావరి-కావేరి అనుసంధానంతోపాటు పలు అంశాలపై చర్చ 

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చర్చించనుంది. కమిటీ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం అధ్యక్షతన దిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న నదుల అనుసంధాన ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై చర్చ జరగనుంది.

ఇచ్చంపల్లి... మేడిగడ్డపై..

తెలంగాణలోని గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి కావేరీ బేసిన్‌కు 141 టీఎంసీల నీటిని మళ్లించే అనుసంధాన ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ఇప్పటికే ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు పంపింది. దీనిపై కేంద్రం ఐదుసార్లు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సమ్మక్కసాగర్‌(తుపాకుల గూడెం) బ్యారేజీకి ఎగువన 28 కిలోమీటర్ల దూరంలోనే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే గోదావరి వరదపై ప్రభావం పడుతుందని, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వాదిస్తోంది. ఇందుకు బదులుగా సమ్మక్క సాగర్‌ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. అలాగే ఫౌండేషన్‌ స్ట్రక్చర్స్‌ లోపాలతో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ కుంగిపోయిన అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యంకాకపోతే ఈ బ్యారేజీకి దిగువనే నిర్మించనున్న ఇచ్చంపల్లి బ్యారేజీ ఎత్తు పెంచడం ద్వారా కాళేశ్వరం ప్రయోజనాలను కాపాడే ఆస్కారం ఉందని టాస్క్‌ఫోర్స్‌ భావిస్తోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ఈ అంశంపై దృష్టిసారించి నివేదిక ఇవ్వాలని కూడా కోరిన నేపథ్యంలో ఈ సమావేశ ఎజెండాలో దీనిని చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు