విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!

దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

Published : 18 Apr 2024 03:47 IST

గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విద్యుత్‌ ఉత్పత్తి చేసి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవచ్చంటూ ఆయా కేంద్రాలకు అవకాశమిచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఒక విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తయ్యే కరెంటును కొనుగోలు చేయడానికి ఒప్పందం విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)తో ఉంటుంది. అయితే సహజ వాయువు(గ్యాస్‌)తో విద్యుదుత్పత్తి వ్యయం అధికంగా ఉండటం వల్ల గ్యాస్‌ ఆధారిత కేంద్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు కొన్ని డిస్కంలు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఆయా కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ విక్రయ ధరలను నిర్ణయించడానికి జాతీయస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్ర విద్యుత్‌ శాఖ పేర్కొంది. ఈ కమిటీకి కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ను అధ్యక్షుడిగా, మరో నలుగురిని సభ్యులుగా నియమించింది. అవసరమైతే మరో ఇద్దరు సభ్యులను సైతం కమిటీ నియమించుకోవచ్చని అవకాశమిచ్చింది. గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అవుతున్న అన్ని ఖర్చులపై అధ్యయనం చేసి ‘విద్యుత్‌ ఛార్జ్‌ రేటు (ఈసీఆర్‌)’ను ఈ కమిటీ నిర్ణయించాలని ఆదేశించింది. ఒకసారి విద్యుత్‌ విక్రయ ధరను నిర్ణయించిన తర్వాత ప్రతి పక్షం రోజులకోసారి మళ్లీ సమీక్షించి అవసరమైతే సవరించాలని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సహజవాయువు ధరల పెరుగుదల, దిగుమతి రవాణా వ్యయం వంటివాటిని పరిశీలించి విద్యుదుత్పత్తి వ్యయాన్ని ఈ కమిటీ నిర్ణయించాలని పేర్కొంది. అధిక ధరలున్నాయని ఈ కేంద్రాల నుంచి కరెంటు కొనడానికి డిస్కంలు తిరస్కరిస్తే.. ఆయా కేంద్రాలు విద్యుత్‌ను ఇతరులకు అమ్ముకోవచ్చు. దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాకు, జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌ నిర్వహణకు ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అవసరమని కేంద్ర విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. ఈ కేంద్రాలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కలిగి ఉన్న డిస్కంలు అడిగితే వాటికే ముందుగా తప్పనిసరిగా కరెంటు సరఫరా చేయాలని ఆంక్షలు విధించింది. అవి వద్దంటేనే బయటకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కేంద్రాల్లో ఎంత కరెంటు ఉత్పత్తి చేశారు.. ఎన్ని యూనిట్లు జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా చేశారు.. బయటి మార్కెట్‌లో ఎంత విక్రయించారు.. అనే వివరాలతో వారానికోసారి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు