గురుకుల విద్యార్థి ప్రశాంత్‌ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్‌ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 18 Apr 2024 03:49 IST

కుటుంబంలో ఒకరికి పొరుగు సేవల్లో ఉద్యోగం
సాంఘిక సంక్షేమశాఖ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్‌ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించామని.. నివేదిక ఆధారంగా బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘గురుకుల పాఠశాలలో మొత్తం 407 మంది విద్యార్థులుండగా.. ఈ నెల 12న 26 మంది వేర్వేరు అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురికాగా భువనగిరి జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం పంపించాం. వీరిలో కొందరిని మెరుగైన చికిత్స కోసం వివిధ ఆసుపత్రులకు తరలించాం. ఆరో తరగతి చదువుతున్న ప్రశాంత్‌ మినహా మిగిలిన అందరూ కోలుకున్నారు. ప్రశాంత్‌ మరణం వల్ల వారి కుటుంబ సభ్యులకు కలిగిన నష్టాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా.. మా పరిధి మేరకు అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.20వేలు అందజేశాం. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి గురుకులాల్లో పొరుగు సేవల కింద ఉద్యోగం ఇస్తాం. చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నష్టపరిహారం మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. విద్యార్థులు అనారోగ్యానికి గురైన రోజు నుంచి గురుకులంలో జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. నీరు, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించాం. నీటి నాణ్యతలో లోపం లేదని నివేదిక అందింది. ఆహార పదార్థాల నాణ్యత పరీక్షల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ప్రాథమిక విచారణ అనంతరం పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీరామ్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశాం. పాఠశాల కేటరింగ్‌, శానిటేషన్‌ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం. 15 రోజులపాటు విద్యార్థుల బాగోగులు చేసుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించాం.’’అని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని