బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం

Published : 18 Apr 2024 05:39 IST

గోల్డ్‌ బాండ్‌ పథకంలో డిపాజిట్‌
ఆదాయం పెంపునకు దేవాదాయ శాఖ చర్యలు

ఈనాడు-హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీ-న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలంకారానికి వినియోగించగా మిగిలినవి కొన్నేళ్లుగా లాకర్లలో ఉన్నాయి. ఆలయాల్లో బంగారు తాపడం కోసం ఇచ్చిన దాంట్లో మిగిలిన పుత్తడిదీ అదే పరిస్థితి. వాటికి అద్దె, బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. అలా నిరుపయోగంగా ఉంచడం కంటే గోల్డ్‌ బాండ్‌(గోల్డ్‌ మానిటైజింగ్‌) పథకంలో డిపాజిట్‌ చేయడం ద్వారా ఆదాయం పొందాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఆలయాలు ఈ ప్రక్రియను మొదలుపెట్టగా.. మరికొన్ని ఆలయాల ఈవోలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ప్రక్రియ ఇలా.. తొలుత ఆలయాల నుంచి ఎంతమేర బంగారం అప్పగించనున్నారో ఎస్బీఐకి నివేదిక ఇవ్వాలి. బ్యాంకు వారు ఆ బంగారాన్ని కరిగించి 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి బిస్కెట్లుగా మారుస్తారు. ప్యూరిటీ ఆధారంగా ఆలయాలకు ధ్రువపత్రం అందిస్తారు. సుమారు ఐదేళ్లు ఇది పెట్టుబడిగా కొనసాగుతుంది. బంగారం ధర ఆధారంగా వడ్డీ జోడిస్తుంటారు. గడువు ముగిసిన తర్వాత అప్పటి ధరల ప్రకారం.. బంగారం లేదా నగదు తీసుకోవచ్చు. లేదా బాండ్‌ గడువును మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయం, బాసర సరస్వతి ఆలయం, ధర్మపురి, వేములవాడ, యాదాద్రి తదితర ప్రముఖ దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని గోల్డ్‌ బాండ్‌ పథకం కింద ఎస్‌బీఐకి అప్పగించారు. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ ఆలయానికి సంబంధించి కిలో బంగారాన్ని పథకంలో పెట్టారు. ఉజ్జయినీ మహాకాళి ఆలయానికి సంబంధించి 14 కిలోల బంగారం, 600 కిలోల వెండి కానుకలు ఉండగా అందులో కొంతమేర రుద్రాక్ష మండపం బంగారు తాపడానికి వినియోగించనున్నారు. మిగిలిన బంగారాన్ని గోల్డ్‌ బాండ్‌ పథకంలో పెట్టనున్నట్టు ఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని