ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే

భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 19 Apr 2024 05:13 IST

భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు
కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై విచారణ జరపాలని ఆదేశం

ఈనాడు, దిల్లీ: భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఏఎస్‌ నం.145/1994కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, రివ్యూ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు తనకు అధికారంలేని విషయంలో జోక్యం చేసుకొందని.. హక్కులు నిరూపించుకోలేని ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భిన్న విధానాలు అనుసరించిన ప్రభుత్వంతోపాటు, ప్రతివాది రూ.5 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సంబంధిత కోర్టుల ముందు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలుచేసిన అంశంపై విచారణ జరిపి, అందుకు బాధ్యులైన వారి నుంచి ఖజానాకు జరిగిన నష్టాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశంపై హైకోర్టుముందు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు 624/2021ని మూసేయాలని ఆదేశించింది. అలాగే మరో వ్యాజ్యకాలీన దరఖాస్తును డిస్మిస్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

1971లో నోటిఫికేషన్‌ జారీ..

కొంపెల్లి గ్రామ శివారులో జాతీయ రహదారికి అతి సమీపంలోని 106.34 ఎకరాలు తనదేనంటూ మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసీం అనే వ్యక్తి క్లెయిమ్‌ చేసుకోగా, అది అతనిది కాదు.. రిజర్వ్‌ఫారెస్ట్‌ భూమి అని ఏపీ ప్రభుత్వం 1971 నవంబర్‌ 11న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. సదరు భూమి తనదేనని ఖాసీం దాఖలు చేసుకున్న దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తర్వాత ఆ కేసు జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లడంతో అక్కడా అతనికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత రిజర్వ్‌ఫారెస్ట్‌గా ప్రకటిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా 1984 సెప్టెంబర్‌ 1న దాన్ని డిస్మిస్‌ చేశారు. దాంతో అబ్దుల్‌ఖాసీం 1985 ఏప్రిల్‌ 23న వరంగల్‌ అదనపు సబ్‌ జడ్జి-1 ముందు సూట్‌ దాఖలుచేసి ఆ భూమిపై హక్కులు కల్పిస్తూ శాశ్వత ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 1993 డిసెంబరు 6న ఆ కోర్టు సదరు వ్యక్తికి టైటిల్‌ మంజూరుచేస్తూనే, దాన్ని స్వాధీనంచేస్తూ ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దానిపై దాఖలైన అప్పీల్‌పై విచారించిన హైకోర్టు.. ట్రయల్‌కోర్టు అతనికి టైటిల్‌ మంజూరుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతోపాటు, ఆ కేసులో అతనికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడాన్ని సమర్థించింది. మొత్తంగా ఆ సూట్‌లోని భూమి అంతా అటవీభూమేనని 2018 జులై 20న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్‌చేస్తూ అదే ఏడాది నవంబర్‌ 18న ఖాసీం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలుచేయగా దాన్ని విచారించి అతనికి అనుకూలంగా 2021 మార్చి 19న తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 4న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలుచేసింది. కేసు పూర్వాపరాలు, ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తొలి అప్పీల్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రివ్యూ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ కేసులో రెవెన్యూ అధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను ప్రతివాది ఏపీ ఫారెస్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 15 కింద సవాలే చేయలేదు. తన పేరిట హక్కులు ఖరారు చేయాలని, ఆ భూమిలోకి ప్రభుత్వ అధికారులు అడుగుపెట్టకుండా శాశ్వతంగా ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని మాత్రమే కోరారు. కాబట్టి ట్రయల్‌కోర్టులో అతను దాఖలుచేసిన సూట్‌కు విచారణార్హతే లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు

ఈ కేసులో ప్రభుత్వ అధికారులు స్పష్టమైన విధానం తీసుకోకుండా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ప్రతివాదులకూ రూ.5లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ‘‘సూట్‌లో పేర్కొన్న ఆస్తి అటవీభూమి అని స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భిన్న విధానాలు అనుసరించింది. అంతిమంగా సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో ఆ తప్పును సరిదిద్దుకొంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అందుకే ప్రతివాదితోపాటు ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నాం. ఆ మొత్తాన్ని వారు రెండునెలలలోపు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలి’ అని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని