ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

Published : 19 Apr 2024 05:13 IST

70 వేల మందితో భారీ బందోబస్తు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. సుమారు 70 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం 160 కంపెనీల సాయుధ బలగాలను రాష్ట్రానికి కేటాయించిందని, ఇప్పటికే 60 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. గురువారం 42 మంది అభ్యర్థులు 46 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికాస్‌రాజ్‌ మాట్లాడారు.

పత్రాల భర్తీలో జాగ్రత్త

‘‘నామినేషన్‌, అఫిడవిట్‌ పత్రాల్లోని అన్ని అంశాలను అభ్యర్థులు నింపాలి. ఖాళీలు వదిలేస్తే అభ్యర్థులకు అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నిర్దిష్ట గడువులోగా సరిచేసి ఇవ్వని పక్షంలో ఆ నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అభ్యర్థులకు సహకరించేందుకు ప్రతి నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే.. నిర్దేశిత సమయాల్లో కేసుల వివరాలను పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ప్రచురించాలి. నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. ఆ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని.. నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అభ్యర్థి మరో పార్టీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన పక్షంలో ఆ విషయాన్ని ఎన్నికల సంఘం న్యాయవిభాగం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.

3న ‘ఇంటి నుంచి ఓటు’ ప్రారంభం

రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,010 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 మంది ఓటర్లు నమోదయ్యారు. 18-19 సంవత్సరాల యువ ఓటర్లు 9,01,942 మంది, వయోవృద్ధలు 1,93,641, దివ్యాంగులు 5,27,034 మంది ఉన్నారు. ఓటరుగా నమోదుకు ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉంది. ‘ఇంటి నుంచి ఓటు’ హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తారు.

2022 నుంచి 60.60 లక్షల ఓట్ల తొలగింపు

2022 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళనను ఎన్నికల సంఘం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 60.60 లక్షల ఓట్లు తొలగించాం. 32.81 లక్షల మంది అదనంగా నమోదయ్యారు. 30.68 లక్షల మంది మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి ఓటరు సమాచార పత్రాలు పంపిణీ చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతినిధులను పంపి.. పంపిణీ తీరును పరిశీలించవచ్చు.

ఎన్నికల విధులకు రాని ఉద్యోగులపై చర్యలు

రాష్ట్రంలో 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటికి అదనంగా 452 సహాయ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ అనుమతి ఇచ్చింది. 9,900 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎన్నికల విధుల్లో 2.90 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. ఇంకా 40 వేల మంది ఉద్యోగులు ఒకటీరెండు రోజుల్లో నమోదు చేసుకోవాలి. ఎన్నికల విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలుంటాయి.

కేసీఆర్‌ సమయం కోరారు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ మరో వారం రోజుల గడువు కోరారు. ఆయన వివరణ ఇవ్వాల్సిన గడువు గురువారం ఉదయం 11 గంటలకు ముగిసింది. గడువు పెంపు కోరుతూ ఆయన రాసిన లేఖను ఈసీకి పంపాం. దానిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఉల్లంఘనలపై రాజకీయ పార్టీల నుంచి 20 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 4,099 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మరో 1,107 ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,355 వివిధ నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. గురువారం వరకు రూ.136 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని వికాస్‌రాజ్‌ వివరించారు. సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని