ఈపీఎస్‌ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?

ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్‌) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్‌వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Published : 19 Apr 2024 07:00 IST

పదేళ్లుగా పెంపునకు నోచుకోని లబ్ధిదారులు
బీపీ, షుగర్‌ మాత్రలకూ సరిపోవడంలేదని ఆవేదన
 ‘రూ.2 వేలకు పెంపు’ సిఫార్సులకు కేంద్ర ఆర్థిక శాఖ మోకాలడ్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్‌) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్‌వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ మొత్తం బీపీ, షుగర్‌ మాత్రల కొనుగోలుకూ సరిపోని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. తక్కువ వేతనాలతో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి ప్రస్తుత అవసరాల మేరకు కనీస పింఛను మొత్తాన్ని రూ.2 వేలకు పెంచాలంటూ ఈపీఎఫ్‌వో ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్ర ప్రభుత్వ సహకారం లేక అమలుకు నోచుకోవడంలేదు.

2014లో రూ.వెయ్యికి పెంపు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2014లో కనీస పింఛనును రూ.వెయ్యికి పెంచింది. అంతకుముందు దాదాపు 80 శాతం మంది పింఛనుదారులకు రూ.వెయ్యికి లోపు పింఛను లభించేది. వీరిలో కొందరికి నెలకు రూ.25 కన్నా తక్కువ వచ్చేవి. అప్పట్లో ఈపీఎస్‌ నిల్వలపై వచ్చే వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం.. పింఛను చెల్లింపులు ఎక్కువ ఉండటంతో ఆలోటు భర్తీకి యజమాని చెల్లించే వాటాకు 1.16 శాతం నిధి సర్దుబాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమేరకు పదేళ్లుగా తన వాటా నిధులు ఇస్తోంది. ప్రస్తుతం కేంద్ర వాటా నిధులు దాదాపు రూ.10 వేల కోట్లకు చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో కనీస పింఛను పెంచాలని గత ఐదేళ్లుగా కార్మిక సంఘాలు, ఈపీఎఫ్‌వో ట్రస్టీలు డిమాండ్‌ చేస్తున్నారు. పలు కమిటీలు సైతం కనీస పింఛను పెంచాలని నివేదికలు ఇచ్చాయి. ఇటీవల ఉన్నతస్థాయి కమిటీ కనీస పింఛనును రూ.2 వేలకు పెంచాలని సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ సహాయాన్ని కోరాలని సూచించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో బడ్జెట్‌ సహాయం చేయాలని కోరగా.. ఆర్థిక మంత్రిత్వశాఖ తిరస్కరించింది.

భారీగా నిధులు.. వడ్డీ ఆదాయం...

ప్రస్తుతం ఈపీఎస్‌ ఖాతాలో నిధులు పెరిగాయి. ఈ పథకంలో 29 కోట్ల మంది సభ్యులుగా ఉండగా.. 7 కోట్ల మంది ఖాతాల నుంచి మాత్రమే పింఛను చెల్లింపులు జరుగుతున్నాయి. ఏటా యజమానుల నుంచి ఈ ఖాతాలోకి వస్తున్న చందా సైతం పెరుగుతోంది. 2022-23 ఏడాదికి చందాల రూపంలో రూ.56,170 కోట్లు.. 2023-24లో రూ.60,902 కోట్లు వచ్చాయి. 2024-25 ఏడాదికి కనీసం ఏడు శాతం పెరుగుదలతో రూ.65,335 కోట్లు వచ్చే అవకాశాలున్నట్లు సంస్థ అంచనా వేస్తోంది. ఈ నిధుల్ని పబ్లిక్‌ ఖాతాలు, సెక్యూరిటీల్లో పెట్టుబడులతో సంస్థ వడ్డీ ఆదాయాన్ని పొందుతోంది. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్‌ ఖాతాల కన్నా సెక్యూరిటీల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటోంది. మొత్తంగా గత మూడేళ్లుగా వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.50 వేల కోట్లకు పైనే ఉంటోంది. 2024-25 ఏడాదికి ఈపీఎస్‌ నిల్వల నుంచి రూ.6.47 లక్షల కోట్లు సెక్యూరిటీల్లోకి పెట్టుబడులుగా వెళ్లనున్నాయి. ఆ ఏడాదికి ఈపీఎస్‌ నిల్వలు రూ.9.88 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్‌వో అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని